Tension at Gadapa Gadapa Program: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నిర్వహిస్తున్న గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ప్రజాప్రతినిధులకు ప్రజల నుంచి ప్రశ్నలు వినిపిస్తూనే ఉన్నాయి. ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి పెద్ద ఎత్తున స్పందన వస్తోందని అధికార పార్టీ నాయకులు చెపుతున్నా.. క్షేత్రస్థాయిలో మాత్రం ఇందుకు విరుద్ధంగా ఉంది. ఎక్కడికి వెళ్లినా మా గ్రామానికి ఏం చేశారన్న నిలదీతలే వ్యక్తమవుతున్నాయి. ఇలా ఇంటింటికి వెళ్లిన ప్రజాప్రతినిధులకు.. ఏం సమాధానం చెప్పలేని పరిస్థితలో ముందు నుయ్యి వెనక గొయ్యి మాదిరిగా పరిస్థితులు నెలకొన్నాయి. మంత్రులు, ఎమ్మెల్యే, నాయకులు ఎవరైనా గానీ.. ప్రజలు మాత్రం తమ సమస్యలను చెప్పేందుకు వెనక్కి తగ్గటం లేదు. అధికారంలోకి వచ్చాక తమ సమస్యలను పరిష్కరిస్తామని హామీ.. ఎందుకు అమలు చేయడం లేదని తమ దగ్గరకు వచ్చిన నాయకులను ప్రశ్నిస్తున్నారు.
ఇలాంటి పరిస్థితుల నుంచి తప్పించుకునేందుకు, మరికొందరు ప్రజాప్రతినిధులు ఏదో రూపంలో ప్రజల్లోనే తిరిగేందుకు యత్నిస్తూనే.. తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అనకాపల్లి అచ్యుతాపురం ఎమ్మెల్యే..ఇలాంటి పరిణామాలు ఎదురైనా, ఆయన ఏ మాత్రం తగ్గడం లేదు. తాజాగా మరోసారి ఆలాంటి పరిస్థితే ఎదురైంది. అయితే, ఈ సారి ప్రతిపక్ష టీడీపీ.. ఎమ్మెల్యేను అడ్డుకోవడంతో, నెపాన్ని అధికారులపైకి తోసేశారు. దీనికంతటికి స్థానిక అధికారులదే తప్పని తేల్చారు. దీంతో టీడీపీ నేతలు శాంతించారు.