TDP Leader Ayyanna Pathrudu Comments on NTR: యుగపురుషుడు, శకపురుషుడు సర్గీయ నందమూరి తారక రామారావు గురించి నేటి తరం విద్యార్థులకు తెలిసే విధంగా ఆయన జీవిత చరిత్రను పాఠ్యాంశంగా పెడతామని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు తెలిపారు. అనకాపల్లిలో ఎన్టీఆర్ శత జయంతి జిల్లా స్థాయి ఉత్సవాలు నిర్వహించారు.
పాఠ్య పుస్తకాల్లో ఎన్టీఆర్ జీవిత చరిత్ర: రాబోయే రోజులు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందని.. వచ్చిన వెంటనే పాఠ్య పుస్తకాల్లో ఎన్టీఆర్ జీవిత చరిత్ర చేరుస్తామని చెప్పారు. చిన్న వయసులోనే ఎమ్మెల్యేగా, మంత్రిగా అయ్యే అవకాశం తనకు ఎన్టీఆర్ దయ వల్ల దక్కిందన్నారు. దేశంలో అత్యున్నత దర్యాప్తు సంస్థ అయిన సీబీఐ.. కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులను సైతం అరెస్టు చేసిందని.. అలాంటిది మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్ రెడ్డిని ఎందుకు అరెస్టు చేయలేకపోతున్నారో.. దీని వెనుక ఎవరు ఉన్నారో దేశ ప్రధానమంత్రి, హోం శాఖ మంత్రి అమిత్ షా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అవినాష్‌రెడ్డి అరెస్టు యత్నాలను వైసీపీ రౌడీలతో అడ్డుకోవడం, వారికి పోలీసులు సహకరించడం సిగ్గుచేటని పేర్కొన్నారు. హత్యకేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తిని అరెస్టు చెయ్యనియ్యకుండా పోలీసు అధికారులు చేసిన ప్రయత్నంతో రాష్ట్ర పోలీసుల పరువు పోయిందన్నారు. ఇందుకు కారకులైన ఎస్పీ, డీజీపీలను తక్షణం సస్పెండ్ చేయాలని అయ్యన్న డిమాండ్ చేశారు.