TDP Leader Ayyanna On Margadarsi And Ramoji Rao: సుమారు 60 సంవత్సరాలుగా ఇటు పత్రికా రంగంతో పాటు వివిధ వ్యాపార సంస్థలను పరిచయం చేసి.. ప్రపంచంలోనే ప్రఖ్యాత వ్యక్తిగా గుర్తింపు పొందిన ఈనాడు సంస్థల అధిపతి రామోజీరావుపై కక్ష సాధింపు చర్యలు తగవని మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు చింతకాయల అయ్యన్న పాత్రుడు సూచించారు. ఈ మేరకు అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈనాడు పత్రిక ద్వారా తెలుగు ప్రజల్లో రామోజీరావు చైతన్యం నింపారని కొనియాడారు.
ఫిర్యాదు లేకపోయినా వేధింపులు సరికాదు: నేడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారికి పచ్చళ్ళు పరిచయం చేసి.. వారి మన్ననలు పొందిన మహోన్నత వ్యక్తి అని అయ్యన్న వివరించారు. ప్రధానంగా తెలుగువారితో పాటు ప్రపంచ దేశాలు గర్వించే ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకుని హైదరాబాద్లో ఫిలిం సిటీ స్థాపించి ఎంతో మందిని సినీ పరిశ్రమకు పరిచయం చేసిన వ్యక్తి అని అయ్యన్నపాత్రుడు పేర్కొన్నారు. కరోనా విజృంభించిన విపత్కర పరిస్థితుల్లో సైతం సహాయం చేసి ఆదుకున్న వ్యక్తిపై రాజకీయ కక్ష సాధింపు చర్యలు భావ్యం కావన్నారు. మార్గదర్శి వ్యాపారంలో ఎలాంటి అవినీతి, అక్రమాలు లేకపోయినప్పటికీ ఏపీ సీఐడీ అధికారులు వేధింపులు చేయడం తగదన్నారు.
కేవలం కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఇలా వ్యవహరిస్తున్నారు: 1962లో మార్గదర్శి చిట్ ఫండ్ వ్యాపారాన్ని ప్రారంభించి.. నేడు 108 బ్రాంచీలో దిగ్విజయంగా నడుపుతున్నారన్నారు. ఖాతాదారుల నుంచి ఎలాంటి ఫిర్యాదులు లేకపోయినప్పటికీ కేవలం కక్ష సాధింపు ధోరణిలో భాగంగానే ఇలా వ్యవహరిస్తున్నారని.. ఇది ఏమాత్రం సరైనది కాదన్నారు. పద్మభూషణ్ అవార్డు గ్రహీత అయిన రామోజీపై ఇటీవలే ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి చేసిన వ్యాఖ్యలను అయ్యన్న మరోసారి గుర్తు చేశారు.