ఆదివారం తెల్లవారుజామున 4 గంటలు.. ప్రజలంతా ఇంకా నిద్రమత్తులోనే ఉన్నారు.. అదే సమయంలో ఆక్రమణల కూల్చివేత అంటూ అనకాపల్లి జిల్లా నర్సీపట్నం పురపాలక, రెవెన్యూ అధికారులు రెండు పొక్లెయిన్‌లతో నేరుగా తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడి ఇంటిపైకి దూసుకొచ్చారు. మాటమాత్రమైనా యజమానికి చెప్పకుండా ఇంటి వెనుక ప్రహరీని కూల్చివేయడం మొదలుపెట్టారు. అయ్యన్న భార్య పద్మావతి వచ్చి కూల్చివేత ఆపాలని కోరినా అధికారులు ఆగలేదు. తర్వాత ఆయన కుమారుడు రావడం, తెదేపా శ్రేణులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకోవడంతో కూల్చివేత ప్రక్రియ తాత్కాలికంగా నిలిచింది. నర్సీపట్నంలోని సర్వే నంబరు 276ఎలో 0.02 ఎకరాల (2 సెంట్ల)ను చింతకాయల అయ్యన్నపాత్రుడి కుమారుడు రాజేష్ ఆక్రమించినట్లు స్థానిక తహసీల్దారు జయ నోటీసిచ్చారు. నిషేధిత భూమి (పంట కాలువ)లో పక్కా భవనం నిర్మించుకున్నారంటూ అందులో పేర్కొన్నారు. ఆ నోటీసును 2వ తేదీనే ఇచ్చామని తహసీల్దార్ చెబుతున్నారు. శనివారం రాత్రే నోటీసు తెచ్చి గోడకు అతికించారని, తమకు మాటమాత్రమైనా చెప్పకుండా కూల్చివేతలు మొదలుపెట్టారని అయ్యన్న కుటుంబం మండిపడింది. నిబంధనల మేరకు ఇల్లు కట్టామని, ప్రభుత్వ సర్వేయర్లతో సర్వే చేయించాలని డిమాండ్ చేసింది. దీంతో అధికారులు సర్వే ప్రారంభించారు. ఆదివారం తెల్లవారుజాము నుంచి మధ్యాహ్నం వరకు సాగిన ఈ తతంగం నర్సీపట్నంలో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. 300 మంది పోలీసులను మోహరించడం, తెదేపా శ్రేణులూ పెద్ద ఎత్తున రావడంతో వాగ్వాదాలు, తోపులాటలతో ఆ ప్రాంతమంతా ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. వైకాపా ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టినందుకే అయ్యన్న ఇంటిపై చీకటి దాడులకు దిగారని తెదేపా మండిపడింది. బీసీలపై దాడులు, హత్యలకు నిరసనగా నేడు ‘చలో నర్సీపట్నం’కు పిలుపునిచ్చింది.
నర్సీపట్నంలో ఆదివారం తెల్లవారుజామున 4 గంటలకల్లా స్థానిక ఐదురోడ్ల కూడలి, శివపురం ప్రాంతాల్లో పోలీసులు రోడ్డుకు అడ్డుగా బారికేడ్లు ఉంచారు. వచ్చేపోయేవారిని ఆపి ఎక్కడకు వెళ్తున్నారంటూ ఆరా తీశారు. అప్పటికే పట్టణంలో విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. అదే సమయానికి రెండు పొక్లెయిన్లతో అధికారులు అయ్యన్నపాత్రుడి ఇంటి వెనుకకు చేరుకున్నారు. పురపాలక సంఘం పొక్లెయిన్‌తో ఇంటి వెనుక వంటగది ప్రదేశంలో ప్రహరీ కూల్చడం మొదలుపెట్టారు. శబ్దానికి వంటమనిషి లోవ నిద్రలేచి ఇదేంటని ప్రశ్నించగా మహిళా పోలీసులు ఆమెను దూరంగా తీసుకుపోయారు. చుట్టుపక్కల వారు ఫోన్ చేయడంతో అయ్యన్న సతీమణి పద్మావతి బయటకు వచ్చారు. కూల్చివేతను ఆపాలని ఆమె కోరినా అధికారులు పట్టించుకోలేదు. సమాచారం తెలియగానే విశాఖలో ఉన్న అయ్యన్న కుమారుడు రాజేష్ హుటాహుటిన నర్సీపట్నం వచ్చారు. తమ ఇంటికి అన్ని అనుమతులు ఉన్నాయని, ముందుగా నోటీసు ఇవ్వకుండా ఎలా కూల్చేస్తారని మున్సిపల్ కమిషనర్ కనకారావును ప్రశ్నించారు. అర్ధరాత్రి అందరూ నిద్రలో ఉన్నప్పుడు ఆక్రమణ అంటూ మార్కింగ్ వేశారని ఆరోపించారు. మున్సిపాలిటీ పొక్లెయిన్‌తో కొంతమేర ప్రహరీని కూల్చిన తర్వాత అధికారులు దాన్ని పంపేశారు. ప్రైవేటు పొక్లెయిన్‌ను తీసుకువచ్చినా.. అయ్యన్న ఇంటి గోడను కూల్చేందుకు అని తెలిసి డ్రైవర్లు ఎవరూ ముందుకు రాలేదు. దీంతో కూల్చివేతలు తాత్కాలికంగా ఆగాయి. పోలీసులు దగ్గరుండి కూల్చివేతలు కొనసాగించడమేమిటని రాజేష్ నిలదీశారు. అధికారులు బందోబస్తు కోరినందునే వచ్చామని ఏఎస్పీ విజయ్ మణికంఠ జవాబిచ్చారు.
నక్సలైట్లమా? గంజాయి స్మగ్లర్లమా: చింతకాయల విజయ్
మరోవైపు అయ్యన్న పెద్ద కుమారుడు, తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ ఉదయం 8 గంటల సమయంలో నర్సీపట్నం చేరుకున్నారు. ఇంటి నిర్మాణానికి అనుమతులన్నీ ఉన్నాయంటూ పత్రాలను మీడియాకు చూపారు. నక్సలైట్ల ఏరివేతకు, గంజాయి స్మగ్లర్లను పట్టుకోవడానికి వచ్చినట్లు పోలీసు బలగాలను తమ ఇంటి వద్ద మోహరించడమేంటని మండిపడ్డారు. బీసీలను అణగదొక్కేందుకే ప్రభుత్వం ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని ధ్వజమెత్తారు. అయ్యన్నపాత్రుణ్ని ఏమీ చేయలేక ఇలాంటి దుశ్చర్యలకు తెగబడ్డారని ఆరోపించారు. ‘ముందుగా నోటీసు ఇవ్వలేదు. అప్పటికప్పుడు తెచ్చి ఇంట్లోకి విసిరేశారు. మా పరువు తీసిన అధికారులపై న్యాయస్థానంలో కేసు వేస్తాను’ అని పేర్కొన్నారు. తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత, మాజీ మంత్రి కోండ్రు మురళి, పలువురు మాజీ ఎమ్మెల్యేలు, నాయకులు మధ్యాహ్న సమయంలో అయ్యన్న ఇంటికి చేరుకున్నారు.
సర్వే చేయించండి.. ఆక్రమణ ఉంటే మేమే తొలగిస్తాం
ఈలోగా ఆర్డీవో గోవిందరావుతో రాజేష్ మాట్లాడారు. ‘ప్రభుత్వ సర్వేయర్ల చేత సర్వే చేయించండి. ఏ మాత్రం ఆక్రమణ ఉందని తేలినా మేమే తొలగిస్తాం’ అని అడిగారు. దీంతో ఆర్డీవో పది మంది సర్వేయర్లను రప్పించారు. వారంతా ఇంటి చుట్టూ సర్వే చేస్తుండగా బయట ఉన్న తెదేపా కార్యకర్తలు అడ్డగించి, ఓ సర్వేయర్ వద్ద కాగితాలు లాక్కున్నారు. ఫొటోలు తీస్తున్న ఇంటెలిజెన్స్ ఉద్యోగిని అడ్డుకున్నారు. వెంటనే తెదేపా నాయకులు ఆ కాగితాలను తిరిగి రెవెన్యూ సిబ్బందికి అందజేశారు. ఆ సమయంలో పోలీసులు రావడంతో తోపులాటలు, వాగ్వాదాలు చోటుచేసుకున్నాయి. కార్యకర్తలు అయ్యన్న ఇంటి ఎదుట రహదారిపై బైఠాయించి ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు. చింతకాయల విజయ్ వారిని శాంతింపజేశారు. పోలీసు బలగాలను ఉపసంహరించాలని తెదేపా జిల్లా నాయకులు కోరడంతో కొన్ని బలగాలను వెనక్కు పంపేశారు. సర్వే పనులు సోమవారం ఉదయం కొనసాగించాలని రెవెన్యూ అధికారులు నిర్ణయించారు.
గొంతునొక్కే ప్రయత్నం: అయ్యన్న సతీమణి పద్మావతి