Chandrababu Fires on CM Jagan: జగన్ పాలనలో ఉత్తరాంధ్ర మరింత వెనుకబడిందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు విమర్శించారు. ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో భాగంగా.. అనకాపల్లిలోని నెహ్రూ చౌక్ వద్ద బహిరంగ సభలో ప్రసంగించారు. కనీసం గ్రామాలకు తాగు నీరు ఇవ్వడం లేదని మండిపడ్డారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతిని పూర్తి చేయకుండా మీనమేషాలు లెక్కిస్తున్నారని ధ్వజమెత్తారు. అభివృద్ధి చేతకాని జగన్ అబద్దాలు మాత్రం అందరూ నమ్మేలా చెప్తారని అన్నారు.
పేదలకు సెంటు స్థలాలంటూ మభ్యపెడుతున్న జగన్.. టీడీపీ హయాంలో ఇచ్చినట్లు 3 సెంట్లు ఇవ్వగలరా అని.. చంద్రబాబు సవాల్ విసిరారు. అనకాపల్లికి రోడ్లు వేయించడం చేతకాని మంత్రి గుడివాడ అమర్‌నాథ్ దోపిడీ మాత్రం బాగా చేస్తున్నారని చురకలు అంటించారు. సంపదను సృష్టించి పేదలకు పంచడం తన నైజమని చంద్రబాబు అన్నారు.
"ఈరోజు రోడ్ షోలో అనకాపల్లి రోడ్డు చూశాను గతుకుల బొంత. ఒక రోడ్డు వేయని కోడిగుడ్డు మంత్రి.. పవన్ కల్యాణ్‌ని, నన్ను తిడుతుంటాడు. ఈయన విస్సన్నపేటలో 609 ఎకరాలు భూములు హాంఫట్ చేశాడు. కొండలు, గెడ్డలు కబ్జాలు చేస్తున్నాడు. ఇతన్ని ప్రజా కోర్టులో పెట్టాలి. నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విశాఖలో మూడు పెట్టుబడిదారుల సదస్సులతో రూ.16 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చాం. రూ.6 లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టించాం. 6 లక్షల మందికి ఉద్యోగావకాశాలు కల్పించాం. వీరు వచ్చాక కంపెనీలను తరిమేశారు. అదానీ డేటా సెంటర్, భోగాపురం ఎయిర్‌పోర్టుకి ఐదేళ్ల క్రితం నేను శంకుస్థాపన చేశాను. నేనుండుంటే ఇప్పటికే విమానశ్రయం పూర్తయ్యేది. అప్పుడు వ్యతిరేకించిన జగన్ వారితో కమిషన్లు మాట్లాడుకుని ఇప్పుడు మళ్లీ శిలాఫలకం వేశాడు..సిగ్గుందా ఈయనకి" అంటూ నిలదీశారు.-చంద్రబాబు, టీడీపీ అధినేత