ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

హైకోర్టుకు ఇద్దరు న్యాయమూర్తులు!.. కేంద్రానికి సుప్రీం కొలీజియం సిఫారసు - ఆంధ్రప్రదేశ్ ముఖ్యమైన వార్తలు

Collegium Recommendation For Appointment Of Two Judges: ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టుకు ఇద్దరు న్యాయమూర్తుల నియమించాలని కేంద్రానికి సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసింది. న్యాయాధికారులైన పి. వెంకట జ్యోతిర్మయి, వి.గోపాలకృష్ణారావుకు పదోన్నతి కల్పించాలనే నిర్ణయానికి కొలీజియం ఆమోదం తెలిపింది.

AP High Court
జడ్జిల నియామకానికి కొలీజియం సిఫారసు

By

Published : Jan 10, 2023, 10:34 PM IST

Updated : Jan 11, 2023, 6:29 AM IST

Collegium Recommendation For Appointment Of Two Judges: ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టుకు ఇద్దరు న్యాయమూర్తులను నియమించాలని కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసింది. ప్రస్తుతం న్యాయాధికారులుగా పని చేస్తున్న పి.వెంకట జ్యోతిర్మయి, వి.గోపాలకృష్ణారావులకు హైకోర్టు న్యాయమూర్తులుగా పదోన్నతి కల్పించాలని మంగళవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలో సమావేశమైన కొలీజియం నిర్ణయం తీసుకుంది.

37 మంది న్యాయమూర్తులు ఉండాల్సిన ఏపీ హైకోర్టులో జనవరి 1వ తేదీ నాటికి 30 మంది సేవలందిస్తున్నారు. ఏడు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ ఇద్దరి నియామకానికి కేంద్రం ఆమోద ముద్ర వేస్తే మొత్తం న్యాయమూర్తుల సంఖ్య 32కు చేరుతుంది. మంగళవారం దేశంలోని మొత్తం 5 హైకోర్టులకు 9 మంది పేర్లను కొలీజియం సిఫార్సు చేసింది. ఇందులో కర్ణాటక హైకోర్టుకు ముగ్గురు, ఆంధ్రప్రదేశ్‌, మణిపుర్‌ హైకోర్టులకు ఇద్దరు చొప్పున, బాంబే, గువాహటి హైకోర్టులకు ఒక్కొక్కరి చొప్పున పేర్లను ప్రతిపాదించింది.

న్యాయాధికారి పి.వెంకట జ్యోతిర్మయి

న్యాయాధికారి వెంకట జ్యోతిర్మయి స్వస్థలం గుంటూరు జిల్లా తెనాలి. తల్లిదండ్రులు బాలా త్రిపుర సుందరి, పీవీకే శాస్త్రి. డిగ్రీ వరకు తెనాలిలో చదువుకున్నారు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. 2008లో నేరుగా జిల్లా జడ్జి క్యాడర్‌లో ఎంపికయ్యారు. ఫ్యామిలీ, ఎస్సీ ఎస్టీ, సీబీఐ కోర్టుల్లో పనిచేశారు. వ్యాట్‌ ట్రైబ్యునల్‌ ఛైర్మన్‌గా, విశాఖపట్నం, ప్రకాశం జిల్లాలకు ప్రధాన న్యాయమూర్తిగా (పీడీజే) సేవలందించారు. ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో పీడీజేగా పని చేస్తున్నారు.

న్యాయాధికారి వి.గోపాలకృష్ణారావు

న్యాయాధికారి వెణుతురుమల్లి గోపాలకృష్ణారావు స్వస్థలం కృష్ణా జిల్లా చల్లపల్లి. తల్లిదండ్రులు కోటేశ్వరమ్మ, సోమయ్య. తండ్రి విశ్రాంత సబ్‌ రిజిస్ట్రార్‌. గోపాలకృష్ణారావు అవనిగడ్డ బార్‌ అసోసియేషన్‌లో న్యాయవాదిగా ప్రాక్టీసు చేశారు. 1994లో జూనియర్‌ సివిల్‌ జడ్జిగా ఎంపికయ్యారు. 2007లో సీనియర్‌ సివిల్‌ జడ్జిగా పదోన్నతి పొందారు. మరోసారి పదోన్నతి పొంది 2016 నుంచి అదనపు జిల్లా జడ్జిగా శ్రీకాకుళం, తిరుపతిలలో న్యాయ సేవలందించారు. ప్రస్తుతం గుంటూరు మొదటి అదనపు జిల్లా జడ్జిగా పని చేస్తున్నారు. ఆయన కుమారుడు వి.రఘునాథ్‌ ఇటీవల జూనియర్‌ సివిల్‌ జడ్జిగా ఎంపికై కర్నూలు జిల్లా ఆత్మకూరు కోర్టులో ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్నారు.

ఇవీ చదవండి

Last Updated : Jan 11, 2023, 6:29 AM IST

ABOUT THE AUTHOR

...view details