Murders Terror:ప్రశాంతతకు మారుపేరుగా ఉన్న అనకాపల్లి జిల్లాలో నాలుగు నెలల కాలం నుంచి జరుగుతున్న వరుస హత్యలు జిల్లా ప్రజల్లో భయాందోళనలు రేకెత్తిస్తున్నాయి. హత్య కేసులో నిందితులను పట్టుకోవడం పోలీసులకు సవాలుగా మారుతోంది. ఎలమంచిలి నియోజకవర్గ పరిధిలో నాలుగు నెలల కాలంలో నాలుగు హత్యలు జరగ్గా ఇప్పటికీ మూడు కేసుల్లో నిందితులను పట్టుకోవడంలో పోలీసులు విఫలమయ్యారు. హత్య చేయడంతో పాటు ఆధారాలు దొరక్కుండా నిందితులు జాగ్రత్త పడడం పోలీసులకు సవాలుగా నిలుస్తోంది.
వరుస హత్యలతో బెంబేలు..: గత ఏడాది అక్టోబర్ 12వ తారీఖున మునగపాక మండలం నాగులపల్లి గ్రామానికి చెందిన ఎల్లపు మహాలక్ష్మి నాయుడు హత్యకు గురయ్యాడు. నాలుగు నెలలు గడిచినా ఈ కేసులో నిందితులను గుర్తించడంలో పురోగతిలేదు. ఈ ఏడాది జనవరి 15వ తేదీన ఎలమంచిలి రాంబిల్లి మండలాల సరిహద్దు పరిధిలో వంతెన పక్కన గెడ్డలో హత్యకు గురైన వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. యంత్రాల సాయంతో అత్యంత పాశవికంగా కాళ్లు, చేతులు ముక్కలుగా కోసి గడ్డలో పడేసారు. ఈ కేసును ఛేదించడం పోలీసులకు సవాల్‌గా మారింది. ఇప్పటివరకు కేసులో నిందితులెవరూ పట్టుబడలేదు.
మహిళ హత్యలో వీడని మిస్టరీ...:ఫిబ్రవరి 22వ తారీకు ఎలమంచిలి మండలంలో మర్రబంద సమీపంలో మహిళను హత్య చేసి తగలబెట్టిన ఉదంతం బయటపడింది. ఈమె ఎవరు.. ఎందుకు హత్య చేశారన్నది మిస్టరీగా మారింది. ఈనెల 1వ తేదీన మునగపాక మండలం గణపర్తిలో మేనల్లుడిని మేనమామే దారుణంగా నరికి చంపడంతో హతుడి తల్లిదండ్రులు హతాశులయ్యారు. హత్య చేసిన నిందితుడు మృతదేహం తల, మొండెం వేరు చేశాడు. తానే హత్య చేసినట్టు మేనమామ గాలి శ్రీను పోలీసులకు లొంగిపోవడం విశేషం. పాయకరావుపేట మండలం పి ఎల్ పురంలోఎస్సీ యువకుడు పండ్లమూరి నాగేంద్రను హత్య చేసి మృతదేహాన్ని బావిలో పడేశారు. కేసులో నిందితులను తక్షణమే అరెస్టు చేయాలని దళిత సంఘం నాయకులు ఆందోళన చేపట్టారు.