Ramadevi who trained and became an owner:కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్వయం ఉపాధి కల్పన కోసం పలు రకాల శిక్షణలు ఇస్తుంటాయి. ఆ శిక్షణ కేంద్రాల్లో ఆటవిడుపు, ఆర్థిక సాయం కోసం నేర్చుకున్నవారే ఎక్కువ మంది ఉంటారు. చాలా తక్కువ మందే ఆ అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఉపాధికి బాటలు వేసుకుంటారు. అలాంటివారిలో అనకాపల్లి జిల్లా కె.కోటపాడుకు చెందిన నగిరెడ్డి రమాదేవి ఒకరని చెప్పవచ్చు. దుస్తుల తయారీలో కె.కోటపాడు శిక్షణాకేంద్రంలో శిక్షణ పొంది.. ఫ్యాషన్ టెక్నాలజీలో మెళుకువలు నేర్చుకుని ఏకంగా ఓ సంస్థకు అధిపతిగా నగిరెడ్డి రమాదేవి నిలబడ్డారు. ఆమె విజయగాథ అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా గుర్తు చేసుకుంటే.. మరికొందరికి స్పూర్తిదాయకమవుతుంది.
పని నేర్చుకున్నచోటనే యజమాని..: దుస్తుల తయారీపై ఆసక్తి.. ఆ రంగంలో రాణించాలన్న తపన ఆమెను పని నేర్చుకున్నచోటనే యజమానిగా నిలిపింది. తనకు శిక్షణ ఇచ్చిన డీఆర్‌డీఏతోనే ఎంవోయూ చేసుకుని 'డిజైర్ ఓవర్‌సీస్ సంస్థ' అనే పేరుతో ఫ్యాషన్ టెక్నాలజీ సెంటర్‌ను దాదాపు దశాబ్ద కాలంగా విజయవంతంగా నిర్వహిస్తున్నారు. స్థానిక మహిళలకు ఉపాధిని చూపిస్తూ నేటి మగువలకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు.
ఏడాది శిక్షణ జీవనానికి రక్షణ..: మహిళల కోసం జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఏ) దశాబ్దంన్నర క్రితం అన్ని జిల్లాల్లోను ఫ్యాషన్ టెక్నాలజీ సెంటర్లను ప్రారంభించింది. అందులో భాగంగా ఉమ్మడి విశాఖ జిల్లాలో పది కేంద్రాలు ఏర్పాటు చేశారు. వాటిలో కె.కోటపాడు సెంటర్ ఒకటి. ఇందులోనే రమాదేవి 2012-13లో కుట్లు, దుస్తుల తయారీపై ఏడాదికిపైగా శిక్షణ తీసుకున్నారు. వివిధ రకాల మోడల్ దుస్తుల తయారీలో పట్టు సాధించారు.
మూతపడుతుంటే నిర్వహణకు సిద్ధమై..: రాష్ట్ర వ్యాప్తంగా నెలకొల్పిన ఫ్యాషన్ టెక్నాలజీ సెంటర్లన్ని నిర్వహణ లోపంతో ఒక్కోక్కటి మూతపడడం మొదలయ్యాయి. కొన్నింటిని ప్రైవేటు సంస్థలకు అప్పగించారు. ఈ విషయం తెలుసుకున్న రమాదేవి మూతదశలో ఉన్న కె.కోటపాడు సెంటర్‌ను తాను నిర్వహిస్తానని ముందుకు వచ్చారు. డీఆర్‌డీఏతో నెలవారీ అద్దె చెల్లింపు ప్రాతిపదికన ఒప్పందం చేసుకున్నారు. 2014 నుంచి తానే ఈ ఫ్యాషన్ టెక్నాలజీ సెంటర్‌ను నడుపుతున్నారు.
మహిళలకు ఉపాధి కల్పిస్తూ..: 50 మందికి పైగా మహిళలకు నెలవారీ జీతాలిస్తూ ఉపాధిని కల్పిస్తున్నారు. ఈ పదేళ్లలోనూ వందల మందికి కుట్టులో శిక్షణ ఇచ్చారు. కరోనా సమయంలో ప్రైవేటు వ్యక్తుల చేతిలో ఉన్న మిగతా సెంటర్లు కూడా మూతపడ్డాయి. తాను మాత్రం ఆ క్లిష్ట పరిస్థితులను తట్టుకుని విజయవంతంగా నిలవగలిగారు.