ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Farmers Protest: భూములిచ్చి బోరుమంటున్న రైతులు.. పరిహారంపై ప్రభుత్వానికి వేడుకోలు.. - అనకాపల్లి జిల్లా ఎస్సీ రైతుల ఆందోళన వీడియో

Farmers Protest: పేదల ఇళ్ల కోసమంటూ ఎస్సీ రైతుల నుంచి భూమి తీసుకున్నారు. అభివృద్ధి చేసిన ఫ్లాట్‌లో వాటా ఇస్తామని హామీ ఇచ్చారు. నాలుగేళ్లు గడిచాయి. తీసుకున్న భూముల్లో కాలనీలు కడుతున్నారు. కానీ అవి ఇచ్చిన రైతులకు మాత్రం.. ఇచ్చిన హామీలను నెరవేర్చలేదు. దీంతో కడుపు మండిన అన్నదాతలు.. తమ గోడు పట్టదా?అని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ.. ఆందోళనకు దిగారు. సర్కారు సత్వరం స్పందించకుంటే పోరాటాన్ని ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

Anakapalli district SC farmers protest
భూములిచ్చి బోరుమంటున్న రైతులు

By

Published : May 16, 2023, 10:46 AM IST

భూములిచ్చి బోరుమంటున్న రైతులు

Farmers Protest: జగనన్న కాలనీల నిర్మాణం కోసం అనకాపల్లి జిల్లాలోని సంపతిపురం, కోడూరు, గొలగాం, పాపయ్య సంతపాలెం, వేటజంగపాలెం, మామిడిపాలెం, కుంచంగి, కుండ్రం సహా 14 గ్రామాల రైతులు నుంచి.. 1,107 ఎకరాల భూమిని అధికారులు సేకరించారు. భూసేకరణ సమయంలో ఎకరానికి, అభివృద్ధి చేసిన ప్లాట్‌లో 18 సెంట్లు ఇస్తామన్నారని, ఇప్పుడా ఊసే ఎత్తడం లేదని ఎస్సీ రైతులు ఆందోళన చెందుతున్నారు. ఒక వైపు జగనన్న కాలనీ పనులు చేస్తున్న ప్రభుత్వం.. భూములిచ్చిన రైతుల్ని మాత్రం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇళ్ల స్థలాలకు భూములిచ్చి రోడ్డున పడిన రైతులకు న్యాయం చేయాలని ప్రజా, రైతు సంఘాల నేతలు అనకాపల్లి ఆర్డీవో కార్యాలయం వద్ద ఆందోళన చేశారు. జీవో నెంబర్ 72 ద్వారా భూసేకరణ చేసిన అధికారులు ఇప్పుడు పరిహారం ఇవ్వడానికి మీనమేషాలు లెక్కిస్తున్నారని బాధిత రైతులు వాపోయారు. అప్పుడు మూడు రోజుల్లో సాగులో ఉన్న పంటల్ని తొలగించి మరీ భూమి సేకరించిన అధికారులు.. నాలుగేళ్లు గడుస్తున్నా రైతులకు ఎందుకు న్యాయం చేయడం లేదని ప్రశ్నించారు. న్యాయం కోసం పోరాటం చేస్తున్న రైతులపై పోలీసులు బెదిరింపులకు దిగడాన్ని ప్రజా సంఘాల నేతలు తప్పు పట్టారు. ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం ప్లాట్లు అభివృద్ధి చేసి వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు.

"ప్రభుత్వ అధికారులు.. పేద ప్రజలకు సెంటు చొప్పున ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పి మా వద్ద భూములు తీసుకున్నారు. ప్రత్యామ్నాయంగా భూములు చూపిస్తామన్నారు. నాలుగేళ్లు గడిచినా అతీగతీ లేదు" - రాములమ్మ, బాధితరైతు

"నలభై ఏళ్లుగా జీడిమామిడి సాగు చేసుకునే బతుకుతున్నాం. భూములు తీసుకుని అభివృద్ధి చేసి, ఎకరాకు 18 సెంట్లు ఇస్తామన్నారు. నష్టపరిహారం ఇవ్వకుండానే జీడితోటలు నరికేశారు. సాగు లేకుండా మూడేళ్లుగా ఆదాయానికీ గండి కొట్టారు. పేద రైతులను ఇలా అన్యాయం చేయడం ప్రభుత్వానికి తగదు." - దేవి, బాధితరైతు

"పాతికేళ్ల కిందట మా తల్లిదండ్రులు భూమి కొన్నారు. ప్రభుత్వ ఇళ్ల స్థలాలకు భూమి ఇస్తే 50 సెంట్లకు రూ.33 లక్షలు పరిహారం ఇస్తామని 2020 సంవత్సరంలో అధికారులు మాతో సంతకాలు చేయించుకున్నారు. అయితే ఇప్పటి వరకూ మాకు పరిహారం ఇవ్వలేదు. ఈ భూమి తప్ప మాకు ఇతర ఆస్తులేమీ లేవు. పరిహారమివ్వకపోతే ఆత్మహత్య చేసుకోవడం తప్ప మాకు మరో దారి లేదు." - కారింకి సత్యనారాయణ, బాధితరైతు

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details