Porus: అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం ప్రత్యేక ఆర్థిక మండలిలోని (సెజ్) పోరస్ ల్యాబోరేటరీ పరిశ్రమను మూసేయాలని.. రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ఛైర్మన్ ఏకే పరీడా మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. జల, వాయు కాలుష్యానికి కారణమైనందున తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు ఎలాంటి కార్యకలాపాలు చేపట్టరాదని పేర్కొన్నారు. ఈనెల 3న ఇక్కడి ‘సీడ్స్’ అనే దుస్తుల తయారీ కంపెనీలో పనిచేసే 369 మంది మహిళా కార్మికులు విషవాయువుల కారణంగా తీవ్ర అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే.
దీనికి క్లోరిన్ వాయువే కారణమని పరిశ్రమల మంత్రి అమర్‌నాథ్ ప్రకటించిన రెండోరోజే పీసీబీ ఛైర్మన్ ‘సీడ్స్’ ఎదురుగా ఉన్న పోరస్ కంపెనీలో ఉత్పత్తులను నిలిపేయాలని ఆదేశించారు. నిజానికి కార్మికుల అస్వస్థతకు పోరస్ నుంచి విడుదలైన వాయువే కారణమని ప్రమాదం జరిగినరోజే పీసీబీ అధికారులతోపాటు మంత్రి ప్రకటించారు. తర్వాత ఏ వాయువు విడుదలైందో తెలియదని, నిపుణుల కమిటీ విచారణ తర్వాత నిజాలు వెల్లడిస్తామన్నారు.