Ayyannapatrudu: అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలోని.. మాజీ మంత్రి, తెదేపా సీనియర్ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడి నివాసం వద్ద తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఎలాంటి అల్లర్లు జరగకుండా.. అయ్యన్న ఇంటి వద్ద వందకు పైగా పోలీసులు పహారా కాస్తున్నారు. అదనంగా 3 బెటాలియన్లు అక్కడకు చేరుకున్నాయి. ముగ్గురు ఐపీఎస్ అధికారులు అక్కడి పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు. అయ్యన్న ఇంటి వద్ద ఆయన అనుచరులు టెంటు వేసుకుని కూర్చున్నారు.
అయ్యన్న పాత్రుడు పంటకాలువ ఆక్రమించి ఇంటి నిర్మాణం చేపట్టారంటూ.. శనివారం అర్ధరాత్రి జేసీబీలతో ఇంటి గోడను మున్సిపల్ సిబ్బంది కూల్చివేశారు. రెండు సెంట్ల భూమి ఆక్రమించి నిర్మాణం చేపట్టారంటూ.. మున్సిపల్ సిబ్బంది నోటీసులో పేర్కొన్నారు.
ఈ నెల రెండో తేదీతో ఉన్న నోటీసును ఇప్పుడు ఇచ్చి.. వెంటనే గోడ తొలగించడంపై అయ్యన్నపాత్రుడి కుటుంబసభ్యులు తీవ్ర అభ్యంతరం తెలిపారు. అయ్యన్నపాత్రుడి ఇంటి వద్ద బారికేడ్లు ఏర్పాటుచేయడంతోపాటు.. భారీ సంఖ్యలో పోలీసులు మోహరించారు. ఆర్డీవో మణికంఠ.. అయ్యన్నపాత్రుడి ఇంట్లో పరిస్థితిని సమీక్షించారు.
అయ్యన్నపాత్రుడి ఇంటి చుట్టుపక్కల విద్యుత్ సరఫరా నిలిచింది. అర్ధరాత్రి నుంచే.. విద్యుత్ సరఫరాను అధికారులు నిలిపేశారు. అయ్యన్నపాత్రుడి వద్ద పనిచేసేవారు, నిత్యావసరాలు తీసుకొచ్చే వారిని కూడా.. పోలీసులు ఇంట్లోకి అనుమతించలేదు. అలాగే.. అయ్యన్నపాత్రుడి ఇంటికి వెళ్లే రెండు మార్గాలనూ పోలీసులు మూసివేశారు. మీడియాను ఆ పరిసరాల్లోకి రానీయకుండా చర్యలు చేపట్టారు. నర్సీపట్నం ఏఎస్పీ పర్యవేక్షణలోనే పోలీసుల బలగాలు మోహరించారు.
అన్ని నియమాలకు లోబడే ఇంటి నిర్మాణం చేశామని.. ఇంటి గోడ ధ్వంసం చేయడంపై ప్రశ్నించిన అయ్యన్నపాత్రుడి రెండో కుమారుడు రాజేష్‌ను పోలీసులు చుట్టుముట్టారు. అతడ్ని అరెస్ట్ చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో పోలీసులు, అధికారులతో.. అయ్యన్న కుటుంబం వాగ్వాదం, తోపులాట చోటుచేసుకుంది. ఈ నెల రెండో తేదీతో ఉన్న నోటీసును ఇప్పుడు ఇచ్చి.. వెంటనే తొలగించడంపై అయ్యన్న కుటుంబసభ్యులు తీవ్రంగా అభ్యంతరం తెలిపారు.