తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు సహా తొమ్మిది మంది తెలుగుదేశం పార్టీ నాయకులపై అనకాపల్లి జిల్లా నర్సీపట్నం పోలీసులు కేసు నమోదు చేశారు. నర్సీపట్నంలో మరిడి మహాలక్ష్మి పండగ పెద్ద జాగారం సందర్భంగా 15న అబీద్ కూడలిలో ఏర్పాటైన ఓ స్టేజ్ ప్రోగ్రాంలో రాత్రి 11.10గంటల సమయంలో అయ్యన్నపాత్రుడు, ఆయన తనయుడు రాజేష్, తదితరులు పోలీసు విధులకు ఆటంకం కలిగించడంతో పాటు దూషించారని పేర్కొంటూ సెక్షన్ 353, 294(ఎ, బి), 504, 505 (ఎ, బి), 506, రెడ్‌విత్ 34కింద కేసు నమోదు చేశారు. నాతవరం ఎస్సై డి.శేఖరం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు నర్సీపట్నం ఎస్సై నారాయణరావు పేర్కొన్నారు.
పండగ పేరుతో రాజకీయం: ఎమ్మెల్యే గణేష్
మరిడి మహాలక్ష్మి పండగ పేరుతో మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు రాజకీయ లబ్ధి పొందేందుకు యత్నించారని నర్సీపట్నం ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ ఆదివారం ఆరోపించారు. స్థానిక విలేకరులకు పంపిన వీడియో ప్రకటనలో మాట్లాడుతూ.. పండగలో తెదేపా కండువాలు, జెండాలు ఉంచడమే ఇందుకు నిదర్శనమన్నారు. పండగ పేరిట చందాల రూపేణా రూ.3కోట్లు దండుకున్నారని ఆరోపించారు. పోలీసులు తలచుకుంటే అయ్యన్నను లోపల వేయడం పెద్ద కష్టమేమీ కాదని చెప్పారు.