ప్రాణాంతకమైన కెమికల్ లీక్ Pharma Chemical Leak: అనకాపల్లి జిల్లా పరవాడ మండలంలో కెమికల్ లీక్ ఘటన చోటు చేసుకుంది. దీంతో ఆ ప్రాంతమంతా విష వాయువులు వ్యాపించాయి. స్థానికులు వాంతులు, కళ్ల మంటలతో ఉక్కిరి బిక్కిరయ్యారు. పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం.. జవహర్లాల్ నెహ్రూ ఫార్మాసిటీలో మైలాన్ యూనిట్ 9 లేబరోటరీ ఫార్మా కంపెనీకి చెందిన పెనాయిల్ మెర్కాప్టాన్ అనే కెమికల్‌తో ఉన్న డీసీఎం వ్యాన్ నుంచి కెమికల్ లీక్ అయింది. లంకెలపాలెం ఏలేరు కాలువ గట్టు వద్ద ఈ ఘటన జరిగింది. దీంతో దట్టమైన పొగలతో విష వాయువులు క్షణాల్లో ఆ ప్రాంతమంతా వ్యాపించాయి. వాంతులు, కళ్ల మంటలతో లంకెలపాలెం వాసులు అస్వస్థతకు గురయ్యారు.
వారిలో కొంతమంది శ్వాసకోశ సంబంధమైన సమస్యలతో ఆసుపత్రి పాలయ్యారు. విషయం తెలుసుకున్న స్థానిక నాయకులు సుందరపు శ్రీనివాసరావు కొంతమంది లంకెలపాలెం గ్రామస్థానికులు కెమికల్ లీకైన ప్రదేశానికి చేరుకొని.. ఇసుకతో లీకైన కెమికల్‌ను కప్పి మరింత వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకున్నారు. అయితే వారికి కూడా వాంతులు రావడంతో ప్రయత్నాన్ని విరమించారు. వెంటనే స్థానికులు ఈ కెమికల్ లీకేజీ ఘటనపై పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, రెవెన్యూ, పోలీసు అధికారులకు సమాచారం అందించారు.
దీంతో మైలాన్ కంపెనీ వద్దకు అధికారులు చేరుకుని విచారణ చేపట్టారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి ఏఈ శ్రీనివాసరావు, పరవాడ సీఐ పెద్దిరెడ్ల ఈశ్వరరావు, తహసీల్దార్ ప్రకాష్ రావు కర్మాగారం లోపలికి వెళ్లి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కాగా అధికారులు డీసీఎం వ్యాన్‌లో ప్రాణాంతకమైన రసాయనం ఉన్నట్లు గుర్తించారు. లీకైన కెమికల్ చాలా ప్రమాదకరమైనదని పీసీబీ అధికారులు తెలిపారు. ఇంత ప్రమాదకరమైన రసాయనాన్ని రవాణా చేసే విషయంలో యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు తేలిందన్నారు. దీంతో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న మైలాన్ ఫార్మా యాజమాన్యంపై క్రిమినల్ కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు, యూనియన్ నాయకులు డిమాండ్ చేస్తున్నారు.
"కంపెనీ వారు కెమికల్స్‌ను సరిగా లోడ్ చేయకపోవటం, ట్రాన్స్‌పోర్టు యాజమాన్యం కూడా సరైన జాగ్రత్తలు తీసుకోలేదు. దీంతో ఈ ప్రాంతంలో లీకేజ్ ఘటన సంభవించింది. దీనివల్ల స్థానికులకు వాంతులు, కళ్ల మంటలు లాంటి సమస్యలు తలెత్తాయి. దీనిపై రెవెన్యూ అధికారుల నుంచి కంప్లైంట్ తీసుకుని విచారిస్తాం. ఈ కేసులో ఇంకేమైనా వివరాలు తెలిస్తే దానిపై యాక్షన్ తీసుకుంటాం." - ఈశ్వర్రావు, పరవాడ పోలీస్ అధికారి
ఇవీ చదవండి: