NGT FIRES ON BRANDIX COMPANY : రాష్ట్రంలో గ్యాస్ లీకేజ్ ఘటనలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం పూడిమడక రోడ్డులోని అపెరల్ పార్కులో ఉన్న బ్రాండిక్స్ కంపెనీకి ఎన్జీటీ భారీ జరిమానా విధించింది. గతేడాది జూన్ 3 నుంచి 12 వరకు గ్యాస్ లీకైన ఘటనల్లో 410 మంది, ఆగస్టు 2న 129 మంది మహిళా కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. మొత్తంగా 539 మంది ఆస్పత్రి పాలయ్యారు. ఈ ఘటనలపై మీడియా కథనాలను ఎన్జీటీ సుమోటోగా స్వీకరించింది.
NGT FINE TO BRANDIX COMPANY IN GAS LEAKAGE INCIDENTS: "ప్రజల కోసం శాస్త్రవేత్తలు" అనే స్వచ్ఛంద సంస్థ సమర్పించిన నివేదికనూ తీసుకుంది. ప్రమాద ఘటనలపై ఆరుగురు నిపుణులతో కూడిన బృందాన్ని నియమించింది. ఆ నివేదికపై ఎన్జీటీ ఛైర్మన్ జస్టిస్ ఆదర్శకుమార్ గోయెల్, జస్టిస్ సుధీర్ అగర్వాల్, విషయ నిపుణుడు ప్రొఫెసర్ N.సెంథిల్‌తో కూడిన త్రిసభ్య ధర్మాసనం... బుధవారం విచారణ చేపట్టి లిఖితపూర్వక ఉత్తర్వులను శుక్రవారం వెలువరించింది.
పరిహారంగా పది కోట్లు: గ్యాస్ లీకై ఆసుపత్రిలో చేరిన 539 మంది కార్మికులకు లక్ష చొప్పున పరిహారం పొందే హక్కు ఉందని ఎన్జీటీ స్పష్టం చేసింది. కంపెనీ వార్షిక టర్నోవర్ వంద కోట్లు ఉంటుందని వారి న్యాయవాది తెలిపినందున...10 కోట్లు పరిహారంగా చెల్లించాలని ఆదేశించింది. ఆ మొత్తాన్ని కంపెనీ రెండు నెలల్లోగా పీసీబీ ఖాతాలో జమ చేయాలని స్పష్టంచేసింది. అలా చేయకపోతే పీసీబీ కఠిన చర్యలు తీసుకోవచ్చని తేల్చిచెప్పింది. అవసరమైతే కంపెనీని మూసేయవచ్చంది .