ఉపాధ్యాయ పోస్టుకు ఎంపికైన ఎమ్మెల్యే Chodavaram MLA: 1998లో డీఎస్సీ రాసిన ప్రస్తుత చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ 23 ఏళ్ల తర్వాత ఉపాధ్యాయుడిగా ఎంపికయ్యారు. డీఎస్సీ వివాదం న్యాయస్థానంలో పరిష్కారం కావడంతో అప్పట్లో ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థుల ఫైల్‌పై సీఎం జగన్ తాజాగా సంతకం చేశారు. ఉద్యోగానికి ఎంపికైన వారి జాబితాలో ధర్మశ్రీ పేరు కూడా ఉంది. బీఏ సోషల్, ఇంగ్లీష్ పోస్టుకు గానూ ధర్మశ్రీ 1998లో ఉపాధ్యాయ పరీక్ష రాశారు.
అనుకోని కారణాలు, కోర్టు వివాదాల వల్ల 1998 డీఎస్సీ అభ్యర్థులకు ఉద్యోగాలు ఇవ్వలేదు. అనంతరం ధర్మశ్రీ రాజకీయాల్లోకి ప్రవేశించి కాంగ్రెస్ పార్టీ జిల్లా యువజన విభాగంలో చురుగ్గా పని చేశారు. 2004లో కాంగ్రెస్ పార్టీ తరపున మాడుగుల ఎమ్మెల్యేగా మెుదటి సారి ఎన్నికయ్యారు.
తాను టీచర్‌గా ఎంపిక కావడంపై ఎమ్మెల్యే ధర్మశ్రీ మాట్లాడుతూ.. డీఎస్సీ రాసినప్పుడు తన వయసు 30 సంవత్సరాలని గుర్తు చేసుకున్నారు. ఉపాధ్యాయుడిగా స్థిరపడాలని కలలు కన్నానని.., అప్పట్లో పోస్టు వస్తే ఉపాధ్యాయ వృత్తిలో స్థిరపడి ఉండేవాడినని చెప్పుకొచ్చారు. సమాజ సేవకు ఉపాాధ్యాయ వృత్తి ఉన్నతమైనదని.., అప్పట్లో ఉద్యోగం వచ్చి ఉంటే బడి బడికి తిరిగేవాడినని.., ఇప్పుడు ఎమ్మెల్యేగా గడప గడపకు తిరుగుతున్నానని అన్నారు. డీఎస్సీ 1998 బ్యాచ్ తరపున సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నట్లు వెల్లడించారు.
అప్పట్లో డీఎస్సీకి ఎంపికైన వారిలో కొందరు కూలీలుగా మారగా, మరికొందరు వేర్వేరు వృత్తుల్లో స్థిరపడ్డారు. ధర్మశ్రీ రాజకీయాల్లోకి వచ్చి రెండుసార్లు ఎమ్మెల్యే అయ్యారు.
ఇవీ చూడండి