MEDICAL TESTS TO AYYANNA : ఇంటి గోడ కూల్చివేత ఘటనలో ఫోర్జరీ పత్రాలు సమర్పించారంటూ సీఐడీ పోలీసులు అరెస్ట్ చేసిన తెదేపా నేత చింతకాయల అయ్యన్నపాత్రుడు, అతని కుమారుడు రాజేశ్‌లను విశాఖ చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచారు. ఈ కేసుకు 467 సెక్షన్ వర్తించదని మెమోలో న్యాయవాదులు పేర్కొనగా.. కోర్టు అంగీకరించింది. 41ఏ నోటీసు ఇచ్చి ఈ కేసులో తదుపరి చర్యలు తీసుకోవచ్చని కోర్టు సూచించింది. కోర్టులో హాజరుపరిచేముందు వారిద్దరిని సింహాచలం ఆసుపత్రిలో వైద్యపరీక్షలు నిర్వహించారు. సుమారు 20 నిమిషాల పాటు ప్రభుత్వ వైద్యాధికారి భాస్కరరావు పరీక్షలు చేశారు. అయ్యన్న ఒత్తిడికి లోనవుతున్నారని.. బీపీతో ఇబ్బంది పడుతున్నారని వైద్యులు వెల్లడించారు.
మరోవైపు కోర్టు దగ్గరకు తెదేపా కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. తమను కోర్టు ప్రాంగణంలోకి అనుమతించాలని డిమాండ్ చేశారు. కోర్టు ప్రాంగణం బయట రహదారిపై ధర్నా చేపట్టారు.
అసలేం జరిగిందంటే:తెలుగుదేశం సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడును సీఐడీ పోలీసులు అరెస్టు చేశారు. తెల్లవారుజామున పెద్దసంఖ్యలో అయ్యన్న ఇంటికి వెళ్లిన పోలీసులు, ఆయనతోపాటు చిన్న కుమారుడు రాజేశ్నూ అరెస్టు చేశారు. ఇంటి గోడ కూల్చివేతలో ఫోర్జరీ పత్రాలు సమర్పించారంటూ వారిపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేశారు. అయ్యన్నపాత్రుడిని ఏలూరు కోర్టులో హాజరుపరుస్తామని నోటీసుల్లో పోలీసులు పేర్కొన్నారు.