Joint Committee report to NGT: అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం నర్సాపూర్ గ్రామంలోని హెటిరో లేబొరేటరీ పరిశ్రమ నిర్వాహకులు.. తీర ప్రాంత క్రమబద్ధీకరణ జోన్ (సీఆర్‌జెడ్) అనుమతి లేకుండా కొన్ని పనులు చేపట్టినట్లు సంయుక్త కమిటీ పేర్కొంది. ఈ పరిశ్రమ కార్యకలాపాలను క్షేత్ర స్థాయిలో పరిశీలించిన ఈ కమిటీ.. ఇటీవల జాతీయ హరిత ట్రైబ్యునల్ (ఎన్‌జీటీ)కు తన నివేదికను సమర్పించింది.
అందులో... సీఆర్‌జెడ్ అనుమతి లేకుండా గొట్టాలు, డిశాలినేషన్ యూనిట్ ఏర్పాటు చేయడాన్ని గుర్తించింది. దీనికి కేంద్ర పర్యావరణ అటవీ మంత్రిత్వశాఖ అనుమతులు అవసరం. వృథా నీటి నుంచి హానికర నీటిని వేరు చేసే పంపింగ్ వ్యవస్థ లేదని గమనించింది. తనిఖీ సమయంలో గాలి, నీరు, బోర్లు, బావుల నుంచి భూగర్భ జలాల నమూనాలను సేకరించామని, వాటిని విశ్లేషించేందుకు కొంత సమయం పడుతుందని, వాటి నివేదికలు వచ్చిన తరువాత అందులోని అంశాల ఆధారంగా తగిన పరిష్కార మార్గాలు చూపుతామని కమిటీ పేర్కొంది.