ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

AP Jaggery Industry ఆ బెల్లం మాటలు ఏమైయ్యాయి..! మాట నిలుపుకోని జగన్.. సంక్షోభంలో బెల్లం పరిశ్రమ! - Jaggery Industry Crisis in anakapalle

Jaggery Manufacturing industry: బెల్లం తయారీ పరిశ్రమ సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని పాదయాత్రలో ఊదరగొట్టిన జగన్‌.. అధికారంలోకి రాగానే దాని ఊసే మరించారు. ఆదుకుంటానని చెప్పిన హామీని అటకెక్కించారు. ఫలితంగా గిట్టుబాటు ధర లేక.. రైతులు నష్టాలపాలవుతున్నారు. ఇతర రాష్ట్రాల ఉత్పత్తుల పోటీతో.. విక్రయాలు పడిపోతున్నాయి. రైతులను అన్ని విధాలా ఆదుకుంటానని చెప్పి.. నిండా ముంచేయడమేనా రైతు సంక్షేమమంటే అని.. పరిశ్రమ నిర్వాహకులు, రైతులు ప్రశ్నిస్తున్నారు.

Etv Bharat
Etv Bharat

By

Published : Jul 23, 2023, 7:19 PM IST

Jaggery Manufacturing industry : అనకాపల్లి అంటేనే మనకు గుర్తుకొచ్చేది తియ్యటి బెల్లం. అటువంటి బెల్లానికి గిట్టుబాటు ధరలు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. పాదయాత్రలో రైతుల కష్టాలు అడిగి తెలుసుకున్నాను. ప్రభుత్వం వచ్చిన వెంటనే బెల్లం రైతులను అన్ని విధాలా ఆదుకుంటాను. ఇదీ పాదయాత్రలో సీఎం చెప్పిన మాట. చెరకు రైతులను ఉద్ధరిస్తానని, సహకార రంగానికి జీవం పోస్తానని చెప్పిన జగన్‌.. అధికారంలోకి వచ్చిన ఈ నాలుగేళ్లలో ఉత్తరాంధ్రలోని నాలుగు చక్కెర పరిశ్రమలకు చెదలు పట్టించారు.

వాటి విక్రయం దిశగా అడుగులేస్తున్నారు. బెల్లం రైతుల బాగోగులనూ విస్మరించారు. బెల్లం అమ్మకాల్లో దేశంలోనే రెండో అతి పెద్ద మార్కెట్‌, 120 ఏళ్లకు పైగా చరిత్ర ఉన్న అనకాపల్లి నుంచి ఏటికేడు అమ్మకాలు తగ్గిపోతున్నా.. ఆసరా అందించలేదు. కర్ణాటక, మహారాష్ట్ర నుంచి బెల్లం పొడి రూపంలో పోటీ ఎదురై.. స్థానికంగా ధరలు పడిపోతున్నా.. మార్కెట్‌ను నిలబెట్టే ఆలోచన చేయలేదు.

చెరకు సాగుతో పాటు, గానుగ, రవాణా రూపంలో క్వింటాల్‌కు 4వేలవంద రూపాయలకుపైగా ఖర్చు అవుతోంది. కౌలు రైతులైతే ఆ ఖర్చు మరింత ఎక్కువ. కానీ రైతులకు కేవలం 3వేల200 రూపాయలు మాత్రమే దక్కుతోంది. అంటే క్వింటాలుకు 900 నష్టపోతున్నారు. క్వింటాల్‌కు 5 వేల మద్దతు ధర ఉండాలని రైతులు నెత్తీనోరూ బాదుకుంటున్నా.. జగన్‌ చెవికెక్కలేదు. గతేడాది అక్టోబరులో మార్కెటింగ్‌, సహకారశాఖల సలహాదారు బ్రహ్మానందరెడ్డి చేసిన ప్రకటనకు అనుగుణంగా అధికారులు క్వింటాల్‌కు 5 వేలు ఉండాలని సిఫారసు చేసినా ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదు. ఫలితంగా అనకాపల్లి మార్కెట్‌లో బెల్లం అమ్మకాలు ఏటికేడు తగ్గిపోతున్నాయి. 2016-17 సంవత్సరంలో 147 కోట్ల విలువైన అమ్మకాలు నమోదవగా.. 2022-23లో 47.51 కోట్లకు పడిపోయాయి. అంటే 67శాతం క్షీణించాయి. 2019-20 సంవత్సరంలో 2.59 లక్షల క్వింటాళ్ల బెల్లం విక్రయాలు నమోదు కాగా.. 2022-23లో 1.54 లక్షల క్వింటాళ్లకు పడిపోయాయి.

ఉత్తరాంధ్రలో సుమారు 25 వేల కుటుంబాలు, సుమారు లక్ష మంది వ్యవసాయకూలీలు బెల్లం తయారీ పరిశ్రమపై ఆధారపడ్డాయి. ఇప్పుడు వారందరికీ దిక్కుతోచని స్థితిలో పడ్డారు. బెల్లం పరిశ్రమ వైభవం కోల్పోతోందనేందుకు అనకాపల్లి జిల్లాలోని మునగపాక ఒక ఉదాహరణ. గ్రామంలోకి రాగానే బెల్లం ఘుమఘమలు వచ్చే ఈ గ్రామంలోని రైతులు.. గిట్టుబాటు కాక నాలుగేళ్లుగా బెల్లం తయారీ నుంచి వైదొలగుతున్నారు. ఒకప్పుడు 1650 ఎకరాల్లో సాగైన చెరకు ఇప్పుడు 350 ఎకరాలకు పడిపోయింది. గానుగలు 140 నుంచి 25కి పడిపోయాయి. కర్ణాటక, మహారాష్ట్రల నుంచి ఉత్పత్తి అవుతున్నబెల్లం పొడి పోటీ కారణంగా.. అనకాపల్లి మార్కెట్లో ధరలు పడిపోతున్నాయి. మహారాష్ట్ర నుంచి కిలో బెల్లం పొడి 28 నుంచి 30 ధరకు లభిస్తోంది. అక్కడ అధిక దిగుబడినిచ్చే రకాల కారణంగా వ్యయం తక్కువ. మన రాష్ట్రంలో చెరకు దిగుబడులు ఎకరాకు 35 టన్నుల నుంచి 20 టన్నులకు పడిపోయాయి. అన్నింటని గమనించిన జగన్‌ పాదయాత్రలో ఇచ్చిన హామీని నిలబెట్టుకుని బెల్లం తయారీ పరిశ్రమను కాపాడాలని స్థానికులు కోరుతున్నారు.

Subsidies Cut to BC: బీసీల రాయితీలకు జగన్ సర్కార్ భారీగా కోత.. పారిశ్రామికవేత్తల ప్యాకేజీకి మంగళం

సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న బెల్లం తయారీ పరిశ్రమ

ABOUT THE AUTHOR

...view details