ROUND TABLE MEETING : విశాఖలో భూ దోపిడీలు జరుగుతున్నాయని.. అందువల్ల అక్కడ రాజధాని వద్దని ప్రతిపక్షాలు వితండవాదం చేయడం తగదని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. మూడు రాజధానులకు మద్దతుగా అనకాపల్లి జిల్లా కేంద్రంలో జేఏసీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. విశాఖలో భూ అక్రమాలు జరిగితే అందుకు సంబంధించిన వ్యక్తులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఉత్తరాంధ్ర అభివృద్ధిని అడ్డుకునేలా విశాఖను పరిపాలన రాజధానిగా వద్దని తెలుగుదేశం పార్టీ నాయకులు అనడాన్ని వారి విజ్ఞతకే వదిలేస్తున్నామని బొత్స వెల్లడించారు.
ఉత్తరాంధ్ర అభివృద్ధిని అడ్డుకునేలా జరుగుతున్న అమరావతి పాదయాత్ర అనకాపల్లి జిల్లాలో ప్రవేశించగానే శాంతియుత నిరసన తెలపాలని పిలుపునిచ్చారు. స్వచ్ఛందంగా దుకాణాలు మూసేసి బంద్ పాటించాలని తన అభిప్రాయాన్ని జేఏసీ దృష్టికి తీసుకొచ్చారు. అమరావతితో పాటు విశాఖపట్నం, కర్నూలు అభివృద్ధితో అన్ని ప్రాంత వాసులకు మేలు చేకూరేలా సీఎం జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్నారని తెలిపారు. అమరావతి అభివృద్ధికి రూ.లక్షల కోట్లు కావాలని.. అదే విశాఖపట్నం పరిపాలన రాజధానికి రూ.10 నుంచి 15 వేల కోట్లు సరిపోతాయని వెల్లడించారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసమే పరిపాలన వికేంద్రీకరణ జరుగుతుందని.. దీన్ని అడ్డుకొని తెలుగుదేశం పార్టీ నాయకులు చరిత్రహీనులుగా మిగలొద్దని హితవు పలికారు.