Government Hostel Students Were Caught Drinking: తాను అధికారంలోకి వస్తే, దశల వారీగా మద్య నిషేధానికి చర్యలు తీసుకుంటానంటూ, గత ఎన్నికల సమయంలో ఊదరగొట్టి అధికారంలోకి వచ్చారు సీఎం జగన్. అయితే, అధికారం చేపట్టాక మద్యపాన నిషేధం అనే అంశానే మర్చిపోయారు. పట్టణాలు పల్లెల్లు, అంటూ తేడా లేకుండా పెద్దఎత్తున మద్యం అమ్మకాలు చేపడుతూ ఆదాయమే తమ లక్ష్యమన్నట్లుగా సాగుతున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన దుకాణాల్లోనే విక్రయించాల్సిన మద్యం, ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా లభ్యమవుతుంది. తద్వారా విద్యార్థులూ మత్తుకు బానిసలవుతున్నారు. ఇన్ని రోజులు కాలేజీలు, విశ్వవిద్యాలయాలకు పరిమితమైన లిక్కర్ కల్చర్ తాజాగా వసతి గృహాలు, పాఠశాల విద్యార్థుల వరకూ పాకింది.
112 మంది విద్యార్థినిలు- 3 మరుగుదొడ్లు! సమస్యల వలయంలో ఉరవకొండ బాలికల వసతి గృహం
కొత్త సంవత్సరం మందుబాబులకు కిక్క్ ఇస్తే, మద్యం అమ్మకాల ద్వారా ప్రభుత్వానికి యమ కిక్క్ వచ్చింది. గత నాలుగు సంవత్సరాలుగా, ప్రతి ఏటా డిసెంబర్ 31న ఏపీ మద్యం అమ్మకాలలో తన రికార్డును తానే తిరగరాస్తుంది. అందులో భాగంగా రాష్ట్రానికి ఆదాయాన్ని తేవడంలో ప్రభుత్వానికి సహాయ పడుదామనుకున్నారు ఆ వసతి గృహ విద్యార్థులు, అందుకే మూతి మీద మీసాలు రాకపోయినా, నోటితో బీర్ మూత తీసే స్థాయికి ఎదిగారు. 21 సంవత్సరాల పైబడిన వారికి మాత్రమే మద్యం అమ్మకాలు చేయాలన్న నిబంధనలు ఉన్నప్పటికీ, కొత్త సంవత్సరానికి లిక్కర్ పార్టీతో స్వాగతం పలకాలనుకున్న వారిని ఆ నిబంధనలేం ఆపలేకపోయాయి. అనుకున్నదే తడవుగా కొత్త సంవత్సరానికి స్వాగతం చెప్పేందుకు అంతా కలిసి పార్టీ చేసుకున్నారు. వారంతా 6, 7, 10వ తరగతి చదువుతున్న విద్యార్థులే కావడం గమనార్హం. ఆ విద్యార్థులు మద్యం తాగడంతోనే ఆగిపోలేదు. అది తప్పు అని చెప్పిన వారిపై దాడికి తెగబడిన ఘటన అనకాపల్లి జిల్లా చోడవరం పట్టణంలో వెలుగు చూసింది.