YSR Jagananna Colonies: పేదల ఇళ్ల కోసం అంటూ పచ్చని భూములు తీసుకున్నారు. పరిహారం ఇస్తామన్నారు. అభివృద్ధి చేసిన స్థలాల్లో కొంత భాగం అప్పగిస్తామని కూడా మాట ఇచ్చారు. దాదాపు నాలుగు సంవత్సరాలుగా గడిచింది. ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు. వైఎస్సార్ జగనన్న ఇళ్ల నిర్మాణం మాత్రం ప్రారంభించేశారు. ఇంకా ఉపేక్షిస్తే అసలుకే మోసమని భావించిన బడుగుజీవులు న్యాయం కోసం పోరుబాట పట్టారు. పూర్తి పరిహారం, అభివృద్ధి చేసిన భూముల అప్పగింత తర్వాతే పనులు చేయాలంటూ వారం రోజుల నుంచి టెంట్లు వేసి మరీ కూర్చున్నారు. ప్రభుత్వం మాట నిలబెట్టుకునే వరకు వెనక్కి తగ్గేది లేదంటున్న అనకాపల్లి జిల్లా పరవాడ మండల ఎస్సీ రైతులు - మహిళల ఆక్రోశం, ఆవేదన చెందుతున్నారు.
ప్రశ్నిస్తున్న ఎస్సీ, బీసీ రైతులు: మీ భూములను అభివృద్ది చేస్తాం.. దానికి తగిన ప్రతిఫలం నమ్మకంగా ఇస్తాం... అంటూ తియ్యగా ఒప్పందంలోకి లాండ్ పూలింగ్ పేరుతో తీసుకున్నారు. అక్కడ ఉన్న తోటలన్నీ తీసేశారు. హామీలు అమలు చేయకుండా కాలనీలు కట్టేయడం ఏంటని ఎస్సీ, బీసీ రైతులు ప్రశ్నిస్తునారు. ఇక తమకు అభివృద్ది చేసిన భూమి వస్తుందన్న ఆశతో నాలుగు సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న రైతులుకు పట్టాదారులకు నిరాశే ఎదురైంది.