ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పరవాడ ఫార్మాసిటీలో అగ్ని ప్రమాదం.. నలుగురు మృతి - Anakapally Fire Accident News

fire accident in parawada
పరవాడ ఫార్మాసిటీలో అగ్ని ప్రమాదం

By

Published : Dec 26, 2022, 9:46 PM IST

Updated : Dec 27, 2022, 6:39 AM IST

21:38 December 26

మరో కార్మికుడి పరిస్థితి విషమం

పరవాడ ఫార్మాసిటీలో అగ్ని ప్రమాదం.. నలుగురు మృతి

Parawada Pharmacity Fire Accident : అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మాసిటీని ప్రమాదాలు వెంటాతున్నాయి. సోమవారం మధ్యాహ్నం లారస్ ల్యాబ్స్‌లో భారీ అగ్నిప్రమాదంతో ఉద్యోగులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. అగ్నికీలల్లో నలుగురు సజీవ దహనమవ్వగా.. మరొకరు తీవ్ర గాయాలతో మృత్యువుతో పోరాడుతున్నారు. సాల్వెంట్ లీకేజీ వల్లే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.

పరవాడ ఫార్మాసిటీ ప్రమాదాలకు చిరునామాగా మారింది. వరుస ప్రమాదాలతో ఉద్యోగులు, కార్మికులు బెంబేలెత్తిపోతున్నారు. సోమవారం మధ్యాహ్నం లారస్ ల్యాబ్స్‌లో భారీ అగ్నిప్రమాదం నలుగురిని బలిగొంది. మరొకరు తీవ్ర గాయాలతో విశాఖలోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పరిశ్రమ అండర్ గ్రౌండ్లో ఉన్న మూడో యూనిట్‌లోని తయారీ విభాగం - 8లో రియాక్టర్, డ్రయ్యర్ల దగ్గర మధ్యాహ్నం 3 గంటల 15 నిమిషాలకు ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. రబ్బరుతో తయారు చేసిన ఉపకరణాలన్నీ కాలి బూడిదయ్యాయి. మంటలు తగ్గాక సంఘటన స్థలాన్ని పరిశీలించగా నలుగురు సజీవ దహనమైన స్థితిలో, ఒకరు తీవ్రగాయాలతో కొట్టుమిట్టాడుతూ కనిపించారు. శరీరాలు పూర్తిగా కాలిపోయినప్పటికీ ప్రాణాలేమైనా ఉన్నాయేమోనన్న ఆశతో ఆసుపత్రికి తీసుకెళ్లారు. కానీ ఫలితం లేదు.. అప్పటికే నలుగురు చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతదేహాలను విశాఖ కేజీహెచ్​ మార్చురీకి తరలించారు.

సాల్వెంట్ లీకవుతున్నట్లు ముందుగా ఉద్యోగులు గుర్తించారు. సమస్యను పరిష్కరించడానికి పరిశీలిస్తుండగానే ఒక్కసారిగా మంటలు చెలరేగి ప్రాణాలను ఉక్కిరిబిక్కిరి చేసింది. ఏం జరుగుతుందో తెలిసేలోపే ఊపిరి ఆగిపోయింది. మధ్యాహ్నమే ప్రమాదం జరిగినా.. రాత్రి 7గంటల వరకు అయోమయమే. అండర్ గ్రౌండ్లో ప్రమాదం జరగడంతో కొంచెం పొగ మినహా తీవ్రత కనిపించలేదు. ఉద్యోగులు ఫోన్లను గేటు దగ్గరే వదిలేస్తారు. దీంతో అక్కడ జరిగిన పరిణామాలపై బయటకు సమాచారం రాలేదు. పోలీసులకు నాలుగున్నర గంటలకు సమాచారం ఇచ్చారు. వారు వచ్చేలోపే బాధితులను ఆసుపత్రికి తరలించారు. మృతులు ఎవరన్నది కూడా సోమవారం రాత్రి ఏడు గంటల వరకు అధికారికంగా వెల్లడించలేదు. అనకాపల్లి ఆర్డీవో చిన్నికృష్ణ, పరవాడ తహశీల్దార్ ఘటనాస్థలాన్ని పరిశీలించారు. ప్రమాద కారణాలపై విచారణ చేయిస్తున్నట్లు తెలిపారు.

మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తరఫున 25 లక్షల చొప్పున పరిహారం అందిస్తామని పరిశ్రమల శాఖ మంత్రి అమర్నాథ్ ప్రకటించారు. చికిత్స పొందుతున్న బాధితుడికి మెరుగైన వైద్యం అందించాలని... అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలను ఆదుకోవాలని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ అన్నారు. విశాఖలోని ప్రతి పరిశ్రమలో సేఫ్టీ ఆడిట్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. పరవాడ అగ్నిప్రమాదంపై తెదేపా నేత నారా లోకేశ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

ఇవీ చదవండి:

Last Updated : Dec 27, 2022, 6:39 AM IST

ABOUT THE AUTHOR

...view details