Employment For Youth: అచ్యుతాపురం, పరవాడ, మాకవరపాలెం, పాయకరావుపేట, అచ్యుతాపురం సెజ్ కేంద్రాలతోపాటు రాంబిల్లి మండలంలో నిర్మిస్తున్న ప్రత్యామ్నాయ నావికాస్థావరం, బాబా అణువిద్యుత్తు పరిశోధన స్థానం నిర్మాణంతో యువతకు భారీగా ఉపాధి అవకాశాలు పెరగనున్నాయి. పాయకరావుపేట మండలంలోని డెక్కన్ కెమికల్స్ విస్తరణ పనులు జరుగుతున్నాయి. ఇవన్నీ కార్యరూపంలోకి వస్తే సుమారు రూ.లక్ష నుంచి 1.5 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభించడానికి ఆస్కారం ఉందని పరిశ్రమల శాఖకు చెందిన అధికారులు చెబుతున్నారు.
జిల్లాల పునర్విభజన తర్వాత అనకాపల్లి జిల్లా పరిధిలో రాష్ట్రంలోనే అత్యధిక పరిశ్రమలున్నాయి. ఇన్నాళ్లు ఉమ్మడి జిల్లా విశాఖకు తలమానికంగా నిలిచిన ఫార్మా కంపెనీలు ఇప్పుడు కొత్త జిల్లా పరిధిలోకి వచ్చాయి. ఇప్పటికే ఉన్న పారిశ్రామిక వనరులతో జిల్లా అభివృద్ది రూపురేఖలు మారనున్నాయి. కొత్తగా వచ్చే పరిశ్రమలతో యువతకు ఉపాధి అవకాశాలు మెండుగా దక్కనున్నాయి.
ఇప్పటివరకు బెల్లానికి పేరుగాంచిన అనకాపల్లి ఇకపై అంతర్జాతీయ పరిశ్రమలతో పారిశ్రామిక రంగంలో ముద్ర వేయబోతుంది. అచ్యుతాపురం ప్రత్యేక ఆర్థికమండలిలో 180 పరిశ్రమలు ఉన్నాయి. మరికొన్ని కంపెనీలు ఇక్కడకు రావడానికి ఆసక్తి చూపిస్తున్నాయి. బ్రాండిక్స్, ఏషియన్ పెయింట్స్‌తో పాటు ల్యారస్ ల్యాబ్స్, అరబిందో, అభిజీత్, మైథాన్, ఫెర్రో పరిశ్రమలతో వేల మందికి ఉపాధి లభిస్తోంది. మొన్నటి వరకు విశాఖను ఆనుకుని ఉండే పరవాడ మండలంలోని ఫైజర్, మైలాన్, ఫార్మాజెల్, నాట్కో, హితాయి వంటి 80 ప్రసిద్ధ పరిశ్రమలు ఇప్పుడు అనకాపల్లి పరిధిలోకి వచ్చి చేరాయి. దీంతో పారిశ్రామిక జిల్లాగా ప్రత్యేక గుర్తింపు పొందడానికి అవకాశం లభించింది.