Cyclone affect in Anakapally: అసని తుపాను ప్రభావంతో కురుస్తున్న వర్షాలకు.. అనకాపల్లి జిల్లాలో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. పలుచోట్ల వంతెనలు కుంగిపోవటంతో రాకపోకలు నిలిచాయి. వడ్డాది వద్ద ఉన్న ఈ వంతెన శిధిలావస్థలో ఉంది. కాగా.. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు ఈ వంతెన ఓ వైపు కుంగిపోవటంతో.. అధికారులు మేల్కొని వంతెనపై రాకపోకలు నిషేధించారు. ఎమ్మెల్యే ధర్మశ్రీ ఆర్ అండ్ బి ప్రత్యేక కార్యదర్శి కృష్ఢబాబుతో ఫోన్లో మాట్లాడారు. ప్రత్యామ్నాయ రహదారి తాత్కాలికంగా సత్వరమే నిర్మించేందుకు నిధులు ఇవ్వాలని కోరారు.
రెండు రోజులుగా కురిసిన వర్షాలకు.. మాడుగుల మండలంలోని పెద్దేరు జలాశయం ప్రమాదస్థాయికి చేరుకుంది. జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టం 137 మీటర్లు కాగా, ప్రస్తుతం 136.10 మీటర్లకు పెరిగింది. జలాశయంలోకి ఎగువ ప్రాంతం నుంచి 491 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుంది. నీటిమట్టం 130.50 మీటర్లకు చేరితే గేట్లు ఎత్తి దిగువకు వరద నీటిని విడుదల చేస్తామని జలాశయం ఏఈ సుధాకర్ రెడ్డి ప్రకటించారు.