CM JAGAN ON CBN : సీఎం నుంచి ఎమ్మెల్యే వరకూ అందరూ ప్రజల సేవకులని ముఖ్యమంత్రి జగన్ అన్నారు. రాజకీయం అంటే ఇదేనని అనకాపల్లి జిల్లా నర్సీపట్నం బహిరంగ సభలో స్పష్టం చేశారు. నర్సీపట్నంలో రూ.500 కోట్లతో మెడికల్ కాలేజ్‌కు ఆయన శంకుస్థాపన చేశారు. రూ.450 కోట్ల వ్యయంతో నిర్మించే ఏలేరు-తాండవ జలాశ్రయాలు అనుసంధానం చేసే ప్రాజెక్టుకు శంకుస్థాపనతోపాటు.. నర్సీపట్నం పరిధిలో వివిధ అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించారు.
రాజకీయం అంటే.. ప్రతి పల్లె అభివృద్ధి చేయడమని.. మూడేళ్లలో అది చేసి చూపామన్నారు. చంద్రబాబు హయాంలో ఒక్క మంచి పని కూడా చేయలేదని జగన్ ఆరోపించారు. ఫొటో షూట్ కోసం, జనాన్ని ఎక్కువ చూపడానికి ఒక చిన్న సందులోకి నెట్టి.. 8మందిని చంపేశారని చెప్పారు. రాజకీయం అంటే షూటింగ్ కాదని.. ఎస్సీ, ఎస్టీ మధ్య తరగతి జీవితాల్లో మార్పు తీసుకుని రావడమని స్పష్టం చేశారు. చంద్రబాబు ఏది చెప్తే.. పవన్ కల్యాణ్ అది చేస్తాడని విమర్శించారు. చంద్రబాబును చూస్తే కేవలం రెండే విషయాలు గుర్తుకువస్తాయన్న జగన్.. అవి వెన్నుపోటు, మోసాలు అని వ్యాఖ్యానించారు.
"చంద్రబాబు 14 సంవత్సరాల ముఖ్యమంత్రి పదవిలో ఉండి ఒక్క మంచి పని కూడా చేయలేదు. దత్తతండ్రిని నెత్తిన పెట్టుకుని ఊరేగుతున్నాడు మరో దత్తపుత్రుడు. వీరి ఇద్దరి స్టైల్ ఒక్కటే. ఈ రాష్ట్రం కాకపోతే.. మరో రాష్ట్రం, ఈ పార్టీ కాకపోతే మరో పార్టీ అన్నట్లు ఉంటుంది. వీరిద్దరి స్వరూపం చూస్తే.. ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి, ఇదేం ఖర్మ మన రాజకీయానికి అని అనిపిస్తోంది"-సీఎం జగన్