ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

inspiration: కాళ్లు, చేతులు లేకున్నా.. అతని లక్ష్యం మాత్రం చెక్కుచెదరలేదు

young man who lost his legs and arms passed CAT: విద్యుత్‌ ప్రమాదం ఓ యువకుడి జీవితాన్ని తలకిందులు చేసినా.. నిరుత్సాహపడకుండా పట్టుదలతో చదివి కామన్ అడ్మినిస్ట్రేషన్ టెస్ట్.. క్యాట్​లో ఉత్తీర్ణత సాధించాడు. అహ్మదాబాద్‌లో ఎంబీఏ సీటు దక్కించుకుని పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నాడు. తన లక్ష్యం ముందు.. ఎంతటి అవరోదమైనా బలాదూరేనని అంటున్నాడు. ఆ యువకుడి కథనం మీకోసం..

Chandramouli
చంద్రమౌళి

By

Published : Apr 24, 2023, 1:31 PM IST

young man who lost his legs and arms passed CAT: ఆ యువకుడి ఆశల సౌధం అనూహ్యంగా కుప్ప కూలింది.. బీటెక్ పూర్తి చేసి మెకానికల్ ఇంజనీర్ కావాలన్న తరుణంలో విధి వెక్కిరించింది.. విద్యుదాఘాతం ఏకంగా కాళ్లు, చేతులు కోల్పోయేలా చేసింది. ఫలితంగా మంచానికే పరిమితమైన అతనికి మిత్రుల ప్రోత్సాహం కొండంత అండనిచ్చింది.. వైకల్యాన్ని అధిగమించి పట్టుదలతో కామన్ అడ్మినిస్ట్రేషన్ టెస్ట్ ( క్యాట్) ఉత్తీర్ణుడయ్యాడు.. మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (ఎంబీఏ) చదవడానికి అహ్మదాబాద్​లో సీటు సైతం దక్కించుకొని తనకు తానే సాటిగా నిరూపించుకున్నాడు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మున్సిపాలిటీ పరిధి పెద్దబొడేపల్లికి చెందిన ద్వారపురెడ్డి చంద్రమౌళి అనే ఈ దివ్యాంగుడి విజయ ప్రస్థానం మరో పదిమందికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది.

చంద్రమౌళి కుటుంబం ఉపాధి నిమిత్తం నర్సీపట్నం మున్సిపాలిటీ పరిధి పెద్దబొడేపల్లిలో నివాసం ఉంటోంది. తండ్రి వెంకటరమణ చిరు వ్యాపారి. తల్లి సత్యవతి ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయురాలుగా పని చేస్తున్నారు. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో చంద్రమౌళి బీటెక్ పూర్తి చేశాడు. గేట్​లో తర్ఫీదు తీసుకుంటూ సెలవుల్లో ఇంటిదగ్గర ఒకరోజు రేకుల షెడ్డుపై జారిపడిన ఉంగరాన్ని తీయడానికి ప్రయత్నించి విద్యుదాఘాతానికి గురయ్యాడు.

ఈ ఘటన చంద్రమౌళి జీవితాన్ని తలకిందులు చేసింది. విద్యుత్ షాక్ కారణంగా కాళ్లు, చేతులు చచ్చుపడిపోయాయి. తర్వాత ప్రాణాలకు ముప్పు వస్తుందని వైద్యులు సూచించి కాళ్లు, చేతులు తొలగించి చంద్రమౌళిని బతికించగలిగారు. దీంతో అచేతనంగా మంచానికే పరిమితమైన అతని జీవితం ఒక నిరర్థకమని అందరూ భావించారు. చంద్రమౌళిని మిత్రులందరూ భుజం తట్టి ప్రోత్సహించడంతో కుంగిపోకుండా ఎదురీతకు సిద్ధమయ్యాడు. ముందుగా తనకు బాగా పట్టు ఉన్న సాంకేతిక విద్యను సోపానంగా మలుచుకున్నాడు.

వైకల్యంతో ఇబ్బంది అని తలచి మెకానికల్ ఇంజనీరు కోరికను పక్కనపెట్టి, స్నేహితుల సలహాపై మెజిస్ట్రేట్ కావాలని ఎల్​ఎల్​బి పూర్తి చేశాడు. తరువాత చంద్రమౌళి బాగా ఆలోచించి ఇప్పటికే అన్నింటికీ తాను వేరొకరి సాయం పొందుతున్నానని భావించి న్యాయవాద వృత్తి కష్టమని గ్రహించాడు. ఆ తర్వాత తన దృష్టి మళ్లించి క్యాట్ ప్రవేశ పరీక్షలో ప్రతిభ చూపాడు. దేశంలోనే అత్యున్నతమైన బిజినెస్ స్కూల్​గా ప్రసిద్ధి చెందిన అహ్మదాబాద్లోని ఇండియన్ ఇనిస్టిట్యూట్​ ఆఫ్ మేనేజ్​మెంట్​లో సీటు సొంతం చేసుకున్నాడు. పట్టుదల ఉంటే వైకల్యంలో సైతం ఏదైనా సాధించవచ్చునని నిరూపించాడు చంద్రమౌళి.

ఈ సందర్భంగా చంద్రమౌళి మాట్లాడుతూ పట్టు సడలని లక్ష్యం ముందు అన్నీ బలాదూరేనని పేర్కొన్నాడు. విద్యుత్ ప్రమాదంతో ఒక జీవితం ముగిసిపోయిందని ఒక దశలో డీలా పడిన తనను తల్లిదండ్రులు, స్నేహితులు, నర్సీపట్నంలోని ప్రముఖ న్యాయవాది తనలో ఆశలు చిగురింప చేసినట్టు పేర్కొన్నాడు. దీనికి దివ్యాంగుల కోటా సైతం కలిసి వచ్చిందని అమెజాన్​లో డేటా ఆపరేషన్ అసోసియేట్​గా జాబు వచ్చిందని తెలిపాడు. ప్రస్తుతం ఇంటి వద్ద నుంచి దానిని కొనసాగిస్తున్నానన్నాడు.

ప్రస్తుత పరిస్థితికి బిజినెస్ కోర్సు సరిపోతుంది అని క్యాట్ పరీక్ష రాసి అహ్మదాబాద్​లో ఎంబీఏలో సీటు వచ్చిందని ఇందుకు సంబంధించి మెయిల్ సమాచారం అందిందని చంద్రమౌళి పేర్కొన్నాడు. ఎంబీఏ పూర్తి చేసిన తర్వాత అత్యుత్తమమైన మేనేజర్ పోస్టులో రాణించాలని కోరిక ఉన్నట్టు చంద్రమౌళి ఆశాభావం వ్యక్తం చేశాడు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details