ముఖ్యమంత్రిగా జగన్ ఉన్నంతవరకు ఎవరికీ ఉద్యోగాలు రావని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. జగన్ అసమర్థ పాలనతో రాష్ట్రంలో పెట్టుబడులకు ఎవరూ ముందుకురావట్లేదని చెప్పారు. 'ఎన్టీఆర్ స్ఫూర్తి - చంద్రన్న భరోసా' పేరుతో మలి విడత జిల్లాల పర్యటన ప్రారంభించిన చంద్రబాబు.. అనకాపల్లి జిల్లా చోడవరంలో ఏర్పాటు చేసిన మినీ మహానాడులో పాల్గొన్నారు. తెదేపా హయాంలో రూ.లక్ష జీతం వచ్చే ఉద్యోగాలు వచ్చాయని చంద్రబాబు గుర్తు చేశారు. వైకాపా మాత్రం రూ.5 వేల జీతం వచ్చే వాలంటీర్ పోస్టులు మంజూరు చేసిందన్నారు. ఈ రోజుల్లో కూలీ పని చేస్తే నెలకు కనీసం రూ.15 వేలు వేతనం వస్తుందని ఎద్దేవా చేశారు. నిరంకుశత్వ పాలనతో ప్రజలను పీడిస్తున్న జగన్‌ను.. శాశ్వతంగా రాజకీయాల నుంచి సాగనంపాలని ప్రజలకు పిలుపునిచ్చారు. క్విట్ జగన్-సేవ్ ఆంధ్రప్రదేశ్ నినాదంతో ముందుకెళ్లాలని సూచించారు. వైకాపా హయాంలో జే బ్రాండ్ తీసుకువచ్చారని.., మద్యంలో జగన్‌కు నేరుగా వాటా వెళ్తోందని విమర్శించారు.
"రాష్ట్రాన్ని కాపాడుకోవడంలో ఆడబిడ్డల పాత్ర ముఖ్యం. జిల్లాల్లో తెదేపా మహానాడుకు శ్రీకారం చుట్టాం. చరిత్ర ఉన్నంత వరకు తెలుగువారి గుండెల్లో ఉండే ఏకైక వ్యక్తి ఎన్టీఆర్. చోడవరం నుంచి ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు ప్రారంభిస్తున్నాం. తెలుగుదేశం పార్టీ 40 ఏళ్లు పూర్తిచేసుకుంది. మహానాడు నిర్వహించకుండా అడుగడుగునా అడ్డుపడ్డారు. వైకాపా హయాంలో ప్రజలు ఆర్థికంగా చితికిపోయారు. ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. చోడవరం నుంచి వైకాపా పతనం ప్రారంభమైంది." - చంద్రబాబు, తెదేపా అధినేత
అక్రమ కేసులు పెట్టి భయపెట్టాలని చూస్తే ఎవరూ భయపడరని చంద్రబాబు హెచ్చరించారు. అయ్యన్నపాత్రుడిపై ప్రతిరోజూ కేసులు పెడుతున్నారని ఆక్షేపించారు. కేసులకు భయపడబోమని.. దేనికైనా సిద్ధమే అని అన్నారు తెదేపా పని అయిపోయిందని చాలామంది అనుకున్నారన్న చంద్రబాబు.. అలా అనుకోవటం వారి అవివేకమని తెదేపా శాశ్వతంగా ఉందని చెప్పారు. పగటి కలలు కన్న పార్టీ పనైపోయిందని దుయ్యబట్టారు. కష్టాల్లో ఉండేవారికి తెదేపా అండగా ఉంటుందని అన్నారు. ప్రజలను ఇబ్బంది పెడితే వైకాపా నేతల గుండెల్లో నిద్రపోతామన్నారు. జాగ్రత్తగా ఉండకపోతే తగిన శాస్తి చేస్తామని హెచ్చరించారు.
"రాష్ట్రంలో 26 మహానాడు కార్యక్రమాలు నిర్వహిస్తాం. ఏజెన్సీలో 2 మహానాడు కార్యక్రమాలు నిర్వహిస్తాం. 15 రోజులకోసారి మహానాడు నిర్వహిస్తాం. గ్రామంలో సమస్యలపై మహానాడులో చర్చిస్తాం. సామాజిక న్యాయం గురించి మాట్లాడే అర్హత మీకు లేదు. ఉత్తరాంధ్రలో ఏ-2 పెత్తనం చేస్తున్నారు. ప్రజల్లో వ్యతిరేకత చూసి జగన్‌కు భయం పట్టుకుంది. రోడ్ల గుంతలు పూడ్చని వ్యక్తి 3 రాజధానులు కడతారా?. రోడ్లపై గుంతలతో నడుములు విరిగే దుస్థితి. ఆటో డ్రైవర్లకు వచ్చిన డబ్బులు మరమ్మతులకే సరిపోతాయి." - చంద్రబాబు, తెదేపా అధినేత