CBN Uttarandhra tour is over: మూడురోజుల ఉత్తరాంధ్ర పర్యటన ముగించుకొని...తెలుగుదేశం అధినేత చంద్రబాబు అనకాపల్లి నుంచి హైదరాబాద్‌కు బయలుదేరారు. శుక్రవారం రాత్రి అనకాపల్లిలోనే బస చేసిన ఆయనను పార్టీ కార్యకర్తలు, శ్రేణులు అభినందించారు. అనకాపల్లి బెల్లంతో తయారుచేసిన దండను చంద్రబాబు నాయుడుకి వేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలో తరలివచ్చిన పార్టీ నాయకులు, కార్యకర్తలను కలిసి అభివాదం చేశారు.
అనకాపల్లి బహిరంగసభలో..:ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో భాగంగా...అనకాపల్లిలో నిర్వహించిన బహిరంగసభలో పాల్గొని మాట్లాడారు. పేదలకు సెంటు స్థలాలంటూ మభ్యపెడుతున్న జగన్.. టీడీపీ హయాంలో ఇచ్చినట్లు మూడు సెంట్ల స్థలాన్ని మీరు ఇవ్వగలరా అని.. చంద్రబాబు సవాల్ చేశారు. అనకాపల్లికి రోడ్లు వేయించడం చేతకాని మంత్రి గుడివాడ అమర్‌నాథ్ దోపిడీ మాత్రం బాగాచేస్తున్నారని చురకలు అంటించారు. సంపదను సృష్టించి పేదలకు పంచడమే తన నైజమని చంద్రబాబు తెలిపారు.
శుక్రవారం అనకాపల్లిలో రోడ్ షో నిర్వహించిన చంద్రబాబు.. రోడ్డు గతుకుల బొంతగా ఉందని విమర్శించారు. ఒక రోడ్డు వేయని కోడిగుడ్డు మంత్రి.. పవన్ కల్యాణ్‌ని, నన్ను తిడుతుంటాడని... ఈయన విస్సన్నపేటలో 609 ఎకరాలు భూములు హాంఫట్ చేశాడని. కొండలు, గెడ్డలు కబ్జాలు చేస్తున్నాడని అన్నారు. ఇతన్ని ప్రజా కోర్టులో పెట్టాలని ఆగ్రహం వ్యక్తం చేశాడు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విశాఖలో మూడు పెట్టుబడిదారుల సదస్సులతో రూ.16 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చామని గుర్తు చేశారు. రూ.6 లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టించి... 6 లక్షల మందికి ఉద్యోగావకాశాలు కల్పించామని చెప్పారు. వీరు వచ్చాక ఉన్న కంపెనీలను తరిమేశారని అన్నారు. అదానీ డేటా సెంటర్, భోగాపురం ఎయిర్‌పోర్టుకి ఐదేళ్ల క్రితం ఆయన పునాది వేశారని... ఇప్పుడు అధికారంలోఉండుంటే ఇప్పటికే విమానశ్రయం పూర్తయ్యేదని చెప్పారు. అప్పుడు వ్యతిరేకించిన జగన్ వారితో కమీషన్లు మాట్లాడుకుని ఇప్పుడు మళ్లీ శిలాఫలకం వేశాడని...అసలు సిగ్గుందా ఈయనకి" అంటూ చంద్రబాబు నిలదీశారు.