AMMONIA GAS: అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం ప్రత్యేక ఆర్థిక మండలిలోని ‘సీడ్స్’ వస్త్ర పరిశ్రమలో వందలమంది మహిళా కార్మికుల అస్వస్థతకు కారణమైన విషవాయువు ఎక్కడ నుంచి విడుదలైందో 36 గంటల తరువాత కూడా అధికారులు తేల్చలేకపోతున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే విశాఖ పీసీబీ అధికారులు సమీపంలోని ఒక ప్రైవేటు కంపెనీ నుంచి అమ్మోనియా విడుదలైందని, సీడ్స్ కంపెనీకి చెందిన ఏసీ బ్లోయర్స్ దానిని లాక్కోవడంతో కార్మికులు అస్వస్థతకు గురయ్యారని ప్రకటించారు. ఆ కంపెనీలోనే గ్యాస్ లీకైందని ఒకసారి, సమీపంలో ఉన్న సీఈటీ ప్లాంటు నుంచి విడుదలైందంటూ మరోసారి ప్రకటనలు ఇచ్చారు. పరిశ్రమల శాఖ మంత్రి అమర్‌నాథ్ కూడా సమీపంలో ఉన్న కంపెనీ నుంచే విషవాయువు లీకలైందని తొలుత ప్రకటించి.. తరువాత కాదని పేర్కొన్నారు. శనివారం కూడా దర్యాప్తు కొనసాగింది. ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రమాదానికి కారణాలు.. విషవాయువు ఎక్కడ నుంచి విడుదలైంది.. మహిళా కార్మికులు పడిన ఇబ్బందులను తెలుసుకోవడానికి నక్కపల్లి సీఐ నారాయణరావు ఆ పరిశ్రమ ఆవరణలో పరిశీలించారు. సీసీ కెమెరాల నుంచి ఫుటేజీ తీసుకున్నారు. ప్రమాద సమయంలో విధుల్లో ఉన్న ఉద్యోగుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. ప్రమాదంపై సమగ్ర విచారణ కోసం కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) ఓ కమిటీని నియమించింది. వారంలో నివేదిక సమర్పించాలని పీసీబీ సభ్య కార్యదర్శి విజయ్‌కుమార్ ఆదేశించారు.
పీసీబీ అధికారుల రహస్య పర్యటన..
ప్రమాదం జరిగి 36 గంటలు దాటినా మంత్రి అమర్‌నాథ్ ప్రకటించిన కమిటీలోని జేసీ, పీసీబీ ఈఈ, పరిశ్రమలశాఖ ఇన్‌స్పెక్టర్, ఏఎస్పీ ప్రమాద స్థలాన్ని పరిశీలించడానికి రాలేదు. పీసీబీ జోనల్ అధికారులు మాత్రం శనివారం రహస్యంగా పర్యటించారు. 180 వరకు రసాయన పరిశ్రమలున్న ఈ సెజ్‌లో ఏ పరిశ్రమ నుంచి గ్యాస్ లీకైందో తెలుసుకోలేని దుస్థితిలో పీసీబీ అధికారులు ఉండరని, నేతల జోక్యం వల్లనే రహస్యంగా ఉంచుతున్నారేమో అని కార్మికులు అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు.