TDP leaders fire on IT minister Gudivada Amarnath: అనకాపల్లి జిల్లాలోని తుమ్మపాల చక్కెర కర్మాగారాన్ని అమ్మేయాలని చూసినా, కర్మాగారం జోలికి వచ్చినా.. చూస్తూ ఊరుకోమని.. మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు రాష్ట్ర ప్రభుత్వాన్ని, మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ని హెచ్చరించారు. ఎన్నికల ముందు కర్మాగారాన్ని ఆధునికీకరిస్తామని హామీ ఇచ్చి..అధికారంలోకి వచ్చాక మాట మార్చిన గుడివాడ అమర్‌నాథ్‌పై చర్యలు తీసుకోవాలని.. జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రాన్ని సమర్పించారు.
తుమ్మపాల చక్కెర కర్మాగారాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమ్మేయాలని చూస్తే ఊరుకోం: టీడీపీ మంత్రి అమర్‌నాథ్ రాజీనామా చేయాలి..గతకొన్ని రోజులుగా రైతు సంఘాల నాయకులు, కార్మికులు, తుమ్మలపాల గ్రామస్థులు తుమ్మపాల చక్కెర కర్మాగారాన్ని అమ్మొద్దంటూ ఆందోళనలు, నిరసనలు చేస్తున్న విషయం తెలిసిందే. 2019 ఎన్నికల సందర్భంగా కర్మాగారాన్ని ఆధునికీకరిస్తామని, కార్మికులను ఆదుకుంటామని హామీలు ఇచ్చి.. అధికారంలోకి వచ్చాక మాట మార్చిన గుడివాడ అమర్‌నాథ్.. కార్మికులను తీవ్రంగా మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. అధికారులకు వినతిపత్రాలను అందిస్తున్నారు. ఈ క్రమంలో తుమ్మపాల రైతులకు, కార్మికులకు మద్దతునిస్తూ..తెలుగుదేశం పార్టీ నాయకులు నేడు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు.
టీడీపీ నేతలకు అనుమతివ్వని అధికారులు..అనకాపల్లి జిల్లా సమీపంలోని తుమ్మపాలచక్కెర కర్మాగారాన్ని రాష్ట్ర పరిశ్రమల ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమరాథ్ అమ్మాలని చూస్తున్నారని ఆరోపిస్తూ.. తెలుగుదేశం పార్టీ నాయకులు ఈరోజు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసనకు దిగారు. నేటి స్పందన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ, పార్టీ నాయకులు కలిసి తుమ్మపాల చక్కెర కర్మాగారం సమస్యలను జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ల దృష్టికి తీసుకువచ్చే ప్రయత్నం చేశారు. కానీ, అధికారులు కలెక్టర్, జాయింట్ కలెక్టర్ సమావేశంలో ఉన్నారంటూ.. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకూ అనుమతి ఇవ్వకుండా గంటల తరబడి నిలబెట్టారు.
అధికారుల తీరుపై టీడీపీ నేతలు నిరసన..ఈ నేపథ్యంలో రైతాంగ సమస్యలపై స్పందనలో ఫిర్యాదు చేయడానికి వస్తే.. కడప నుంచి వచ్చిన వారితో జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్‌లు సమావేశాలు నిర్వహించి.. తమను లోనికి రానికుండా చేస్తున్నారంటూ.. తెలుగుదేశం పార్టీ నాయకులు కలెక్టర్ కార్యాలయం ఆవరణలో బైఠాయించి నిరసనకు దిగారు. ప్రభుత్వ అధికారుల తీరును నిరసిస్తూ.. నినాదాలు చేశారు. దీంతో స్పందించిన కలెక్టర్.. ఆర్డీఓని పంపి మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ, పార్టీ నాయకులను కార్యాలయంలో తీసుకెళ్లి వినతిపత్రం తీసుకున్నారు.
చక్కెర కర్మాగారం జోలికొస్తే ఊరుకోం..మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ.. ''ఎన్నికల ముందు తుమ్మపాల చక్కెర కర్మాగారాన్ని ఆదుకుంటామని చెప్పిన మంత్రి గుడివాడ అమర్‌నాథ్.. అధికారంలోకి వచ్చాక కర్మాగారాన్ని అమ్మేయాలని చూస్తున్నారు. పరిశ్రమల శాఖ మంత్రిగా కొత్త పరిశ్రమలు తీసుకురావాల్సింది పోయి..ఏళ్ల చరిత్ర కల్గిన తుమ్మపాల చక్కెర కర్మాగారాన్ని మంత్రి అమ్మేయాలని చూస్తూ.. ఈ ప్రాంత రైతాంగానికి తీవ్ర అన్యాయం చేస్తున్నారు. తుమ్మపాల చక్కెర కర్మాగారం జోలికొస్తే.. ఊరుకోమని హెచ్చరిస్తున్నాము. జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని వైఎస్సార్సీపీ కార్యాలయంగా మార్చారు. అధికారులు అధికార పార్టీ నాయకులకు తొత్తులుగా వ్యవహరిస్తున్నారు.'' అని ఆయన అన్నారు.
అసలు ఏం జరిగిదంటే.. ఇటీవలే (ఈ నెల 22వ తేదీన) అనకాపల్లి జిల్లాలోని తుమ్మపాల చక్కెర కర్మాగారంలోని పరికరాల ఆస్తుల విలువను అంచనా వేయడానికి వాల్యుయేషన్ పేరుతో కమిటీ సభ్యులు కర్మాగారం వద్దకు వచ్చారు. అందులో డేవిడ్ మెక్వాన్, డి. విశ్వనాథంలు ఉన్నారు. విషయం తెలుసుకున్న తుమ్మలపాల టీడీపీ నాయకులు, రైతులు, కార్మిక సంఘ సభ్యులు కర్మాగారం వద్దకు చేరుకుని వారిని కర్మాగారంలోకి వెళ్లనీయకుండా అడ్డుకున్నారు. అనంతరం ఎవరు మిమ్మల్ని పంపించారు..? ఎందుకు ఇక్కడికి వచ్చారు..? అని రైతులు.. కమిటీ సభ్యులను నిలదీశారు. దీంతో కర్మాగారాన్ని విక్రయించాలని, అందులోని పరికరాల ఆస్తుల విలువను అంచనా వేయమని.. మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌కి ఆదేశాలు ఇచ్చినట్లు కమిటీ సభ్యులు తెలియజేశారు. దీంతో మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌కి తన పదవికి వెంటనే రాజీనామా చేయాలంటూ రైతులు నినాదాలు చేస్తూ ధర్నాలు చేయటం ప్రారంభించారు.