YSRCP Government Negligence on Tribal Welfare Hostels :విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి విద్యా ప్రమాణాలు అందించాలని సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan Mohan Reddy) పదేపదే ఊదరగొడుతుంటారు. క్షేత్రస్థాయిలో మాత్రం విద్యార్థులకు కనీస మౌలిక సదుపాయాలు కూడా కల్పించలేని దుస్థితిలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఉంది. అధికారుల మాటల్లో వినిపించే మెరుగైన సౌకర్యాలు.. ప్రభుత్వ గిరిజన సంక్షేమ వసతి గృహాల్లో బూతద్దం పెట్టి వెతికినా కనిపించడం లేదు. ఉదయం నిద్ర లేచినప్పటి నుంచి పాఠశాలకు వెళ్లి తిరిగి వచ్చే వరకు ఎటుచూసినా సమస్యలు విలయ తాండవం చేస్తున్నాయి. వాటిన్నింటిని ఎదుర్కొని విద్యనభ్యసించేందుకు అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులోని గిరిజన సంక్షేమ వసతి గృహం విద్యార్థులు ఓ సాహసమే చేస్తున్నారు.
పేరుకే వసతి గృహం కనీస సౌకర్యాలూ గగనం - గిరిజన సంక్షేమ హాస్టళ్లలో సమస్యల తాండవం
Government Hostels Situation Under CM Jagan Ruling :అవి పేరుకే వసతి గృహాలు. వాస్తవానికి ఇది కనీస సౌకర్యాలు లేని సమస్యల నిలయం. అల్లూరి జిల్లా కేంద్రం పాడేరులోని గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో కనీస సౌకర్యాలు లేక విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. ఏజెన్సీ వ్యాప్తంగా 115 ఆశ్రమ పాఠశాలలు ఉండగా వాటిలో 15 వరకు గిరిజన గురుకుల పాఠశాలలు ఉన్నాయి. వాటినిఈ టీవీ భారత్ (ETV Bharat) పరిశీలించగా తలుపులు లేని మరుగుదొడ్లు, కిటికీలు లేని గదులు, పెచ్చులు ఊడిపోయిన పైకప్పులు, ప్రమాదకరంగా ఉన్న పిల్లర్లు, అధ్వానంగా ఉన్న పరిసర ప్రాంతాలు దర్శనమిచ్చాయి. మెరుగైన సదుపాయాలు కల్పించాల్సిన ప్రభుత్వమే.. నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుంటే విద్యార్థులు చదువుపై ఏవిధంగా దృష్టిసారించగలరనే విమర్శలు వినిపిస్తున్నాయి. మరుగుదొడ్లు సైతం విద్యార్థుల చేతే శుభ్రం చేయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తినే ఆహారం సైతం నాణ్యతగా లేకపోవటంతో తినకుండా వదిలేస్తున్నామని విద్యార్థులు వాపోయారు.