Damaged roads: పల్లెసీమలంటే.. పచ్చని చెట్లు, చల్లని గాలులు, సందె వేళ గోధూళి.. అక్కడికి వెళ్లాలంటే నల్లని తాచుపాము లాంటి రోడ్లు... ఇవన్నీ ఒకప్పటి మాటలు. మరి ఇప్పుడో... పల్లెకు వెళ్లే రోడ్లపై అడుగడుగునా గుంతలు.. వాటిపై వెళ్తే విరిగే నడుములు... పట్టపగలు వెళ్లాలంటేనే చుక్కలు కనిపించే పరిస్థితులు... అసలు రోడ్డుందా అనే దుస్థితి... ఈ రోడ్లపై ఇక రాత్రిపూట గుడ్డిదీపాల వెలుగులో వెళ్లామంటే గమ్యస్థానం ఆసుపత్రే. ఇదీ మన రాష్ట్రంలోని గ్రామీణ రహదారుల పరిస్థితి.
ఎటు చూసినా అడుగుకో గుంత పడి... రాళ్లు తేలి... అత్యంత ప్రమాదకరంగా మారిన ఆ దారుల్లో కొంతదూరం వెళ్తేనే ఒళ్లు హూనమవుతోంది. ఏ కాస్త ఆదమరిచినా గోతుల్లో పడి కాళ్ల్లు, చేతులు విరుగుతున్నాయి. ఇక గర్భిణులు ఆసుపత్రులకు వెళ్లాలంటే ఏ క్షణం ఏమవుతుందోనని భయపడాల్సిందే. నరకానికి నకళ్లులా మారిన ఈ పల్లెదారులను 25 జిల్లాల్లో ‘ఈనాడు-న్యూస్‌టుడే’ యంత్రాంగం ఈ నెల 2 నుంచి 4వ తేదీ వరకు నిశితంగా పరిశీలించింది.
మచ్చుకు జిల్లాకో రహదారి తీసుకుని చూస్తే.. వాటి పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. పరిశీలించిన 166 కిలోమీటర్లలోనే ఏకంగా 6,220 గుంతలు కనిపించాయి. వీటిలో దాదాపు వెయ్యి గుంతలైతే.. చాలా పెద్ద పెద్దవి! ఆరోగ్యపరంగానే కాదు.. ఆర్థికంగా కూడా పల్లె జీవితాలను అస్తవ్యస్తం చేస్తున్న ఈ రహ‘దారుణాల’ పరిస్థితిపై క్షేత్రస్థాయి పరిశీలన కథనం
పల్లెల్లోని రహదారుల్లో ప్రయాణం ప్రాణాల మీదకు వస్తోంది. కొన్నేళ్లుగా కనీస నిర్వహణ లేక, మరమ్మతులకు నోచక, గుంతలనైనా పూడ్చకపోవడంతో రోడ్లన్నీ అత్యంత ప్రమాదకరంగా, భయానకంగా మారాయి. వర్షం పడితే ఇక పరిస్థితి అగమ్యమే. ఈ రోడ్లమీద వెళ్లే ఆటోలు, ఇతర వాహనాలు.. అతి తక్కువ సమయంలోనే దెబ్బతింటుండటంతో... వాళ్లకు వచ్చే ఆదాయంలో ఎక్కువ మొత్తం మరమ్మతులకే పోతోంది. పల్లెల నుంచి వ్యవసాయ ఉత్పత్పుల్ని తరలించాలన్నా, సాగుకి అవసరమైన ఎరువులు వంటివి తెచ్చుకోవాలన్నా... ఈ అధ్వానపు రోడ్ల మూలంగా ఖర్చు తడిసి మోపెడవుతోంది.
ఒక పల్లె కాదు.. ఒక ఊరు కాదు.. ఎక్కడ చూసినా ఇదే దుస్థితి. ఉదాహరణకు అన్నమయ్య జిల్లా రామాపురం మండలంలో ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి స్వగ్రామం సుద్దమల్లకు కూతవేటు దూరంలోని కల్పనాయుని చెరువు- మూలపల్లె గ్రామాల మధ్య రహదారి దారుణంగా మారినా పట్టించుకోవడం లేదు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో పర్యాటక ప్రాంతం వంజంగికి వెళ్లే రహదారి అధ్వానంగా ఉంది.
ఉపాధి హామీ పథకం మెటీరియల్ కాంపొనెంట్ నిధుల్ని రాష్ట్ర ప్రభుత్వం మూడేళ్లుగా రహదారులకు నామమాత్రంగా ఇస్తూ, అధిక శాతం నిధుల్ని భవనాల నిర్మాణానికి కేటాయించడంతో ఇవి కనీస మరమ్మతులకు కూడా నోచుకోవట్లేదు. కేంద్ర ప్రభుత్వ గ్రాంట్లతో చేపట్టిన రహదారుల పనులూ గుత్తేదారులకు బిల్లులు చెల్లించక నిలిచిపోయాయి. వెరసి.. రాష్ట్రవ్యాప్తంగా పల్లె రోడ్లన్నీ ఇదే అధ్వాన స్థితికి చేరుకున్నాయి.
* శ్రీకాకుళం జిల్లాలో నక్కపేట- పాలఖండ్యాం- జి.సిగడాం మధ్య 10 కి.మీ.ల రహదారిలో... నిద్దం నుంచి జి.సిగడాం వరకు బాగా దెబ్బతింది. దీంతో దూరం ఎక్కువైనా పొగిరి మీదుగా వెళ్తున్నారు.
* పార్వతీపురం మన్యం జిల్లాలో సాలూరు నుంచి పాచిపెంట మండలం గురివినాయుడుపేట వరకు 9 కి.మీ.ల రోడ్డు అధ్వానం.
* పశ్చిమగోదావరి జిల్లా గుమ్ములూరు- అప్పారావుపేట రహదారి పూర్తిగా పాడైంది. వ్యవసాయోత్పత్తుల్ని తరలించాలన్నా, చేపల మేత, ఎరువులు, ఇతర ఉత్పత్తులను పొలాలకు తీసుకెళ్లాలన్నా ఈ మార్గమే ప్రధాన ఆధారం.
* నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గంలోని పాటూరు గ్రామం నుంచి వినాయక్ నగర్‌కు వెళ్లే 3.1 కి.మీ.ల రోడ్డు ప్రమాదకరంగా తయారైంది.
* ప్రకాశం జిల్లా తాళ్లూరు- అద్దంకి రహదారి గోతులమయంగా మారింది. ఇటీవల కారు బోల్తాపడి పలువురికి గాయాలయ్యాయి.
* నంద్యాల జిల్లా గడివేముల- వెలుగోడు రోడ్డులో పెద్ద గోతులు ఏర్పడ్డాయి. రేగడ గూడూరు నుంచి వేల్పనూరు వరకు 2 కి.మీ. అధ్వానంగా తయారైంది. 2 కి.మీ. ప్రయాణానికి 15 నుంచి 20 నిమిషాలు పడుతోంది.
* శ్రీసత్యసాయి జిల్లా చెన్నేకొత్తపల్లి నుంచి ఆమిదాలకుంట వరకు 15 కి.మీ. రహదారి దెబ్బతింది. 15 గ్రామాల ప్రజలు దీనిపైనే ప్రయాణించాలి. అంబులెన్స్ వచ్చేందుకూ కుదరట్లేదు.
* బాపట్ల జిల్లా గుడిపూడి- ఏట్రవారిపాలెం రహదారి అధ్వానంగా మారడంతో రైతులు, కూలీలు సైకిళ్లపై వెళ్లాలన్నా ఇబ్బంది పడుతున్నారు. చుట్టూ 10 కి.మీ. తిరిగి రావాల్సి వస్తోంది.
గుంతలు కాదు.. ప్రాణగండాలు
* కృష్ణా జిల్లా అవనిగడ్డ- కోడూరు రహదారి ఘోరంగా ఉంది. ఆర్నెల్ల క్రితం అప్పటి సీఎస్ హంసలదీవి వద్ద సాగర సంగమం ప్రాంతానికి వచ్చారు. అధికారులు హడావుడిగా పొక్లెయిన్‌తో గుంతల్ని సరిచేసి, కంకర, క్వారీ డస్టు పోశారు. అరకొరగా చేసిన ఆ పనుల కారణంగా ఇప్పుడు మరింత దారుణంగా మారి, దుమ్ము విపరీతంగా పైకి లేస్తోంది. ఇటీవల గుంతల్లో వాహనం అదుపుతప్పి, వి.కొత్తపాలెం వాసి యలవర్తి శ్రీనివాసరావు మనవరాలు చనిపోయింది.
* తూర్పుగోదావరి జిల్లాలో కాటవరం-కూనవరం మధ్య రోడ్డు దారుణంగా ఉంది. వాహనాలు తరచూ అదుపుతప్పుతున్నాయి. సూరయ్య అనే రైతు తన భార్యతో కలిసి పొలం నుంచి సైకిల్‌పై వస్తూ గోతుల్లో పడిపోయారు. ఆయన భార్య సీతమ్మకు తల పగిలి 6 కుట్లు పడ్డాయి.
ఎమ్మెల్యే ధర్మశ్రీ హామీలు నీటి మూటలే..అనకాపల్లి జిల్లాలోని చోడవరం నుంచి చాకిపల్లి వరకు ఉన్న రోడ్డు మొత్తం గోతులతో నిండిపోయింది. ప్రస్తుత వైకాపా ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ గత ఎన్నికల ముందు ఈ రోడ్డు మీదుగానే పాదయాత్ర చేశారు. రోడ్డు దుస్థితిపై అప్పటి తెదేపా ఎమ్మెల్యే మీద విమర్శలు గుప్పించారు. తనను గెలిపిస్తే బాగు చేయిస్తానని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చి మూడేళ్లైనా ఎమ్మెల్యే ఆ రోడ్డు వంక చూడలేదని, భారీ గుంతలున్నచోట, తామే అప్పుడప్పుడూ మట్టి పోసి పూడ్చుతున్నామని బంగారమ్మపాలెం, పీఎస్‌పేట వాసులు చెబుతున్నారు.
పర్యాటక ప్రాంతంపైనా అశ్రద్ధే..అల్లూరి సీతారామరాజు జిల్లా కేంద్రం పాడేరు నుంచి పర్యాటక కేంద్రమైన వంజంగి మేఘాల కొండకు నిత్యం వాహనాల రద్దీ ఉంటుంది. సీజన్లో వేల సంఖ్యలో పర్యాటకులు వస్తుంటారు. అంత ప్రాధాన్యమున్న ఈ రహదారి గోతుల మయంగా మారింది. అడుగడుగునా రాళ్లు తేలి ప్రమాదకరంగా కనిపిస్తోంది. వర్షాలకు కొన్నిచోట్ల కోతకు గురైంది. వాహనదారులు ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా ఇక్కడ బోల్తాపడటం ఖాయం.
పొలం దోవే దిక్కైంది..
మొలగవల్లి- మద్దికెర రోడ్డు అత్యంత ఘోరంగా ఉంది. భార్యాపిల్లలతో బైక్‌పై వెళ్లాలంటే హడలిపోతున్నాం. వర్షాకాలంలో గుంతల్లో నీరు నిండి లోతు అంచనా వేయలేక నేనే 3 సార్లు కిందపడ్డా. ప్రస్తుతం ఆ రోడ్డుపై ఎవరూ వెళ్లడం లేదు. అంతా పక్కనే ఉన్న పొలాల్లో దోవ పెట్టుకుని మద్దికెరకు వెళుతున్నారు. పంటలు సాగు చేస్తే ఆ దోవలో వెళ్లలేం. అప్పుడీ నరకపు రోడ్డే దిక్కు. - ఆదినారాయణ, మొలగవల్లి, కర్నూలు జిల్లా
రెండుసార్లు పడిపోయా
ఉద్యోగం నిమిత్తం రోజూ అద్దంకి నుంచి తాళ్లూరు వెళ్లొస్తా. నేను దివ్యాంగురాలిని. రోడ్డుపై పెద్ద గోతులు ఉండటంతో ఎంత జాగ్రత్తగా నడిపినా రెండు సార్లు అదుపుతప్పి పడిపోయా. ఆ సమయంలో అటుగా వస్తున్నవారి సాయంతో బయటపడ్డా. మరో దారిలో వెళ్లాలంటే 10 కిలోమీటర్లు తిరిగి రావాలి. వేలమంది రాకపోకలు సాగించే ఈ రహదారిని బాగుచేస్తే అందరికీ ఉపయుక్తం. -కె.సునీత, అద్దంకి, ప్రకాశం జిల్లా