ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Tribals Built Road: గెలిపిస్తే రోడ్డు వేస్తానన్నాడు.. గెలిచాక ఎమ్మెల్యే ముఖం చాటేశాడు - సొంత డబ్బులతో రోడ్డు వేసుకున్న గ్రామస్థులు

Tribals Built Road With Their Money: గిరిజన ప్రాంతాల్లో అడవి బిడ్డలు మౌలిక సదుపాయాలు లేక తీవ్ర అవస్థలు పడుతున్నారు. ప్రభుత్వాలు మారుతున్నా ఆదివాసీలకు డోలీ కష్టాలు తప్పటం లేదు. నడిచేందుకు సరైన రహదారి సౌకర్యం లేక శ్రమదానం చేస్తున్నారు. సొంత నిధులతో రహదారి నిర్మించుకుంటున్నారు.

Tribals Built Road
గిరిజనులు రోడ్డు నిర్మించుకున్నారు

By

Published : Jul 12, 2023, 10:39 PM IST

ఎమ్మెల్యే ముఖం చాటేశాడు.. సొంత నిధులతో రోడ్డు నిర్మించుకున్న గిరిజనులు

Tribals Built Road With Their Money: అల్లూరి సీతారామరాజు జిల్లా హుకుంపేట మండలం డి.సంపంగిపుట్టుకు వెళ్లే రహదారి రాళ్ల మయమైంది. కనీసం నడిచేందుకూ వీలు లేని స్థితికి మారిపోయింది. ద్విచక్రవాహనాలు వెళ్లాలన్నా కష్టంగా మారటంతో గ్రామస్థులు శ్రమదానం చేసేందుకు నిర్ణయించుకున్నారు. వ్యవసాయం చేయగా వచ్చిన కొద్దిపాటి డబ్బులను.. చందాలు వేసుకుని రోడ్డు బాగు చేసుకుంటున్నారు.

తనను గెలిపిస్తే గ్రామానికి రోడ్డు వేస్తానని ఎన్నికల ప్రచార సమయంలో హామీ ఇచ్చిన ఎమ్మెల్యే.. అధికారంలోకి వచ్చాక ముఖం చాటేశారని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోడ్డు గురించి తాము ఎక్కడ ప్రశ్నిస్తామోనని తమ గ్రామానికే రావటం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

దుర్గం సెంటర్‌ నుంచి 9 కిలోమీటర్ల పరిధిలో ఆరు గ్రామాలు ఉన్నాయి. ఆ గ్రామాల నుంచి అటవీ ఉత్పత్తులను మార్కెట్‌కు తరలించాలన్నా.. విద్యార్థులు పాఠశాలకు, కళాశాలకు వెళ్లాలన్నా రహదారి సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అనారోగ్యం పాలైతే కనీసం అంబులెన్సు వచ్చే పరిస్థితి కూడా లేదని గిరిజనులు ఆవేదన చెందుతున్నారు. గర్భిణీలను డోలీ సాయంతో ఆస్పత్రికి తరలిస్తున్నామని ఆదివాసీలు వాపోతున్నారు.

పంచాయతీ నిధులు లేక తాము సర్పంచుగా ఉన్నా.. ఏ పనులూ చేయలేక ప్రజలతో మాటలు పడుతున్నామని తెలిపారు. ఎక్కడికి వెళ్లినా గ్రామాల్లో రోడ్ల గురించి అడుగుతుంటే సమాధానం చెప్పలేకపోతున్నామన్నారు. గిరిజన ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కేంద్ర ప్రభుత్వం అందించే.. సీసీడీపీ నిధులు పంచాయతీలకు పూర్తి స్థాయిలో అందటం లేదని.. దుర్గం సర్పంచ్‌ ఆవేదన వ్యక్తం చేశారు.

"మాకు రహదారి లేదు. అందుకని.. ఇంటింటికీ చందాలు వసూలు చేసుకొని రోడ్డు నిర్మాణం చేస్తున్నాము. ఎన్నికల ప్రచార సమయంలో రోడ్డు వేయిస్తామని చెప్పి.. ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత ఇప్పటి వరకూ ఎవరూ రాలేదు. అధికారులు కూడా పట్టించుకోవడం లేదు. ఆసుపత్రికి వెళ్లాలన్నా, రేషన్ సరుకులు తెచ్చుకుందామన్నా.. రహదారి లేకపోవడం వలన కష్టంగా ఉంది. గడపగడపకు ఎమ్మెల్యే వస్తామన్నారు. అప్పుడు నిలదీయాలి అనుకున్నాం. కానీ అప్పుడు కూడా ఎమ్మెల్యే రాలేదు". - అప్పారావు, సంపంగిపుట్టు

"మేము శ్రమదానం చేసుకుని ప్రస్తుతానికి నాలుగు కిలోమీటర్ల మేర రోడ్డును వేసుకున్నాం. రోడ్డు లేకపోవడం వలన.. ఎవరికైనా ఆరోగ్యం బాగాలేకపోయినా తీసుకెళ్లడం అవ్వడం లేదు. డోలి మోస్తూ తీసుకొని వెళ్లాల్సివస్తుంది". - కేశవరావు, సంపంగిపుట్టు

"రోడ్డు సరిగ్గా లేదు. దీనివలన అంబులెన్స్ కూడా గ్రామానికి వచ్చే పరిస్థితి లేదు. దీని కారణంగా గర్భిణీ స్త్రీలను ఆసుపత్రికి తీసుకొనివెళ్లడం కష్టంగా ఉంది. ఈ రోడ్డుకి ఆనుకొని ఆరు గ్రామాలు ఉంటాయి. వీరంతా తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు ఎవరూ స్పందించడం లేదు". - రమణమ్మ, దుర్గం సర్పంచ్

ABOUT THE AUTHOR

...view details