ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

195 Years Old Teak Trees: వనంలో 'రామలక్ష్మణులు'.. అటవీ అధికారుల మల్లగుల్లాలు..! - కొయ్యూరు మండలం మర్రిపాకల అడవిలో టేకు చెట్లు న్యూస్

195 Years Old Teak Trees: ఆ ప్రాంతంలో 195 సంవత్సరాల వయసు కలిగిన రెండు టేకు చెట్లు పక్కపక్కనే ఉన్నాయి. వాటిని రామలక్ష్మణులుగా భావించి.. అక్కడి గిరిజనులు వాటికి పూజాది కార్యక్రమాలను నిర్వహిస్తుంటారు. అయితే అటవీ అధికారులకు ఇక్కడే ఒక చిక్కొచ్చి పడింది. ఏం చేయాలో అర్థంకాక అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. ఇంతకీ ఆ చెట్లు ఎక్కడున్నాయి, అటవీ అధికారులకు వచ్చిన చిక్కేంటి అనే విషయాలను తెలుసుకుందాం రండి..

195 Years Old Teak Trees
195 ఏళ్ల వయసున్న టేకు చెట్లు

By

Published : May 23, 2023, 12:29 PM IST

195 Years Old Teak Trees: అల్లూరి సీతారామరాజు జిల్లాలో 195 సంవత్సరాల వయసు కలిగిన రెండు టేకు చెట్లు పక్కపక్కనే ఉన్నాయి. గిరిజనుల వాటిని రామలక్ష్మణులుగా భావించి వాటికి పూజలు నిర్వహిస్తుంటారు. అయితే ఇటీవలే వాటిని పరిశీలించిన అధికారులకు ఒక చిక్కొచ్చి పడింది. దీంతో ఏం చేయాలో పాలుపోక అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. వివరాల్లోకి వెళ్తే..

సమాచారం ప్రకారం.. జిల్లాలోని కొయ్యూరు మండలం మర్రిపాకల అటవీ ప్రాంతంలో 1828 సంవత్సరంలో అప్పటి ముస్సిఫ్ రంజమ్​ దొర రెండు టేకు విత్తనాలను తీసుకువచ్చి నాటారు. ఈ అంశం అటవీశాఖ రికార్టులో కూడా నమోదైంది. అయితే పక్కపక్కనే అన్నదమ్ముల్లా పెరిగిన ఆ చెట్లను మర్రిపాకలు, నీలవరం, గంగవరం, పాలసముద్రం, ఎర్రగెడ్డ తదితర గ్రామాల ప్రజలు రామలక్ష్మణులుగా పూజిస్తుంటారు. ప్రతి శ్రీరామనవమికి వచ్చి.. ఆ రెండు చెట్లకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. వారి ఇళ్లల్లో ఏ శుభకార్యాలు జరిగినా వారు ఇక్కడికి వచ్చి పూజలు చేసి తమ ఇంటి శుభకార్యం సజావుగా సాగిపోయేలా చూడాలని వేడుకుంటారు.

ఆ రెండు టేకు చెట్లకు ఇప్పుడు 195 సంవత్సరాల వయస్సు. సాధారణంగా టేకు చెట్టు యాభై, అరవై సంవత్సరాల వయసుకు రాగానే అటవీశాఖ సిబ్బంది వాటిని నరికించి కలప డిపోలకు తరలించి వేలం వేస్తుంటారు. కాగా.. ఈ రెండు చెట్లను గిరిజనులు పూజిస్తుండటంతో వాటిని నరకకుండా అలానే వదిలేశారు. అయితే ఈ రెండు చెట్లల్లో గిరిజనులు శ్రీరాముడిగా పిలుచుకుంటున్న టేకు చెట్టు వయసు మీరి నేలవాలే స్థితికి చేరుకుంది. సరిగ్గా వారం క్రితమే ఈ చెట్టు స్థితిని గమనించిన అటవీశాఖ అధికారులు సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుని వెళ్లారు. గిరిజనుల నమ్మకంతో ముడిపడి ఉండటంతో ఏం చేయాలో అర్థంకాక అధికారులు ఇప్పుడు తర్జనభర్జన పడుతున్నారు.

ఈ రెండు చెట్లు ఆంధ్రప్రదేశ్‌ అర్బన్‌ గ్రీనింగ్‌ అండ్‌ బ్యూటిఫికేషన్‌ కార్పొరేషన్‌-2017 అవార్డుకు ప్రతిపాదిస్తే ప్రత్యేక జ్యూరీ అవార్డుకు ఎంపికయ్యాయి. షీల్డ్‌, ప్రశంస పత్రాన్ని దక్కించుకున్నాయి. ఆ ప్రాంతంలో గిరిజనులు చెట్లను దైవాలుగా ఆరాధించడం అక్కడి విశేషం. రామలక్ష్మణులుగా పూజలందుకుంటున్న ఆ రెండు టేకు చెట్లకు సమీపంలోనే మరో రెండు టేకుచెట్లున్నాయి. వాటిని సీతాదేవి, ఆంజనేయస్వామిగా అక్కడి ప్రజలు భావిస్తుంటారు.

కేరళలోని నీలంబూరులో కలోని టేకు ప్లాంటేషన్‌ 1853 సంవత్సరంలో వేశారు. దానికంటే ముందుగానే అల్లూరి జిల్లాలో ఆ రెండు టేకు చెట్లను నాటడం విశేషం. కాగా.. వాటిలో శ్రీరాముడిగా పూజలందుకుంటున్న చెట్టు అడుగు భాగం ఇప్పుడిప్పుడే పాడవుతోంది. లోపల గుల్లబారే ప్రమాదం ఉందని ఆ చెట్టును పరిశీలించిన చింతపల్లి సబ్‌ డీఎఫ్‌ఓ బెర్నాల్డ్‌రాజు మీడియాకు తెలిపారు. ఆ చెట్ల వద్ద బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించినట్లు ఆయన తెలిపారు. దీంతోపాటు ఆ పరిసరాలను శుభ్రంగా ఉంచాలని సిబ్బందికి పురమాయించినట్లు వివరించారు.

రామలక్ష్మణుల చెట్ల పరిస్థితిని సిబ్బంది పరిశీలించారని చింతపల్లి డీఎఫ్ఓ సీహెచ్. సూర్యనారాయణ పడాల్ తెలిపారు. గిరిజనులు శ్రీరాముడిగా భావించి పూజలు నిర్వహిస్తున్న టేకు చెట్టు అవసాన దిశకు చేరుకుందని ఆయన చెప్పారు. త్వరలోనే దాన్ని చూసొస్తామన్న ఆయన.. తర్వాత ఏం చేయాలనే విషయంపై కన్జర్వేటర్​తో చర్చిస్తామని తెలిపారు. గిరిజనుల మనోభావాలు దెబ్బతినకుండా ఉండేందుకు వారితో సమావేశమయ్యే ఆలోచన ఉందని ఆయన వెల్లడించారు.

కాగా గిరిజనులు శ్రీరాముడిగా భావించి పూజలు నిర్వహించే టేకు చెట్టు ఏకంగా 6.28 మీటర్ల చుట్టుకొలతతో దాదాపు 20 మీటర్ల ఎత్తు కలిగి ఉంది. లక్ష్మణుడిగా భావించే చెట్టు 6.98మీటర్ల చుట్టుకొలతతో దాదాపు 16 మీటర్ల ఎత్తు కలిగి ఉంది. అనంతపురం జిల్లాలో తిమ్మయ్య మర్రిమాను విశిష్టత సంతరించుకున్న విధంగానే అల్లూరి జిల్లాలోని రామలక్ష్మణుల చెట్లు కూడా కొంత ప్రత్యేకతను సంతరించుకున్నాయి.

ఇవీ చదవండి:

Huge funds for Jagan's government : జగన్ సర్కారుకు కేంద్రం భారీ ఆర్థిక సాయం.. ఎన్నికల ముంగిట బహుమానం

కొద్దిగంటల్లో పెళ్లి.. పార్లర్​కు వెళ్లిన వధువుపై కాల్పులు.. కానిస్టేబుల్ పనే

Bichagadu 2 Collections : 'బిచ్చగాడు' బ్రాండ్ సో స్ట్రాంగ్​.. ఫస్ట్ వీకెండ్​ కలెక్షన్స్​ అదుర్స్​

ABOUT THE AUTHOR

...view details