అల్లూరి సీతాారామ జిల్లా మన్యంలో కొండ కోనల నుంచి మంచానపడ్డ గిరిజనులను ఆసుపత్రులకు తరలించాలంటే అరణ్య రోదనే. కొండలు, లోయలను దాటుకొని అటవీ మార్గం మీదుగా డోలీ కట్టుకొని నడుస్తూ గిరిజనులు పడుతున్న బాధలు వర్ణనాతీతం. రోగులను ఆసుపత్రికి తరలించేందుకు అష్టకష్టాలు పడుతున్నారు. ఆసుపత్రికి తరలించే సరికి ఆలస్యం అవుతుండటంతో బాధితుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి.
తాజాగా సకాలంలో వైద్యం అందక రెండురోజుల్లో ఇద్దరు మృతిచెందారు. బాధితులను డోలీలో తీసుకొచ్చిన వారు.. ఆ తర్వాత మృతదేహాలను కూడా అదే డోలీలో తరలించడం అక్కడి పరిస్థితులకు అద్దపడుతోంది. అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం పినకోట పంచాయతీ రాచకిలం గ్రామంలో అనారోగ్యంతో బాధపడుతున్న తామర్ల రాజబాబు అనే గిరిజనుడ్ని గ్రామస్థులు, బంధువులు డోలి కట్టి 12 కిలోమీటర్లు అటవీ మార్గం ద్వారా చింతపాక మోసుకొచ్చారు. అక్కడ నుంచి ప్రైవేట్ ఆటోలో దేవరపల్లి ఆస్పత్రికి తరలించారు. ఆసుపత్రికి వెళ్లిన గంటలోనే రాజబాబు మృతిచెందాడు.