Godavari Floods Merged Mandal People Suffer in Alluri Sitarama Raju District: గోదావరి వరద పోటుతో అల్లూరి సీతారామరాజు జిల్లాలోని పోలవరం విలీన మండలాల ప్రజల కష్టాలు వర్ణనాతీతంగా మారాయి. గ్రామాలను వరద ముంచెత్తడంతో జనం చెట్టుకొకరు, పుట్టకొకరు అన్న రీతిలో తరలిపోయారు. ఊళ్లు అన్నీ నీటిలోనే నానుతున్నాయి. కొందరు కొండల్లో మరికొందరు పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటున్నారు. ఎన్నాళ్లు, ఎన్నిసార్లు వరద కష్టాలు పడాలని ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. ఇవ్వాల్సినవి ఇస్తే తమ దారి తాము చేసుకుంటామని అంటున్నారు.
స్తంభించిన జనజీవనం :గోదావరి పోటెత్తడంతో మరోసారి పోలవరం విలీన మండలాలు జలదిగ్బంధంలో చిక్కుకుపోయాయి. ఉగ్ర గోదావరికి శబరి ప్రవాహం తోడై కూనవరం, వీఆర్‌పురం, ఎటపాక ప్రాంతాలన్నీ నీటమునిగాయి. గ్రామాల్లోకి వరద చేరి జనజీవనం స్తంభించిపోయింది. రహదారులపై నుంచి వరద ప్రవాహిస్తుంది. రాకపోకలకు అవకాశం లేక జనం అష్టకష్టాలు పడుతున్నారు. ఏటికేడు కష్టాలు రెట్టింపు అవుతున్నాయే కానీ తమను ఎవరూ పట్టించుకోవడం లేదని నిర్వాసితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వరద నీటిలో దిగి ఆందోళన :కల్లేరు పంచాయతీ కుయుగూరు గ్రామాన్ని వరద చుట్టుముట్టింది. జనం బయటపడేందుకు దారి లేక సొంతంగా కొండలపై ఏర్పాటు చేసుకున్న నివాసాల్లో ఉంటున్నారు. ప్రభుత్వం తమను పట్టించుకోవడం లేదంటూ వరద నీటిలో దిగి ఆందోళన నిర్వహించారు. ఈటీవీ భారత్ వారిని పలకరించగా తమ ఆవేదన వినిపించారు.
పట్టించుకోని ప్రభుత్వం.. జనం ఆవేదన :చింతూరును వరద ముంచెత్తింది. జాతీయ రహదారి 30 , 326 పూర్తిగా నీటమునిగాయి. రాకపోకలు నిలిచిపోయాయి. వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ఇతర రాష్ట్రాలకు వెళ్లే వాహనాలు చింతూరు మార్కెట్ ప్రాంతంలోనే ఉండిపోయాయి. మార్కెట్ మొత్తం నీట మునిగింది. కూనవరం, వీఆర్ పురంను కలిపే వారధిపై నుంచి వరద ప్రవాహం కొనసాగుతోంది. కొందర్ని పునరావాస కేంద్రాలకు అధికారులు తరలించారు. మరికొందరు నీటి మధ్య జీవనం సాగిస్తున్నారు. ప్రభుత్వం తమను పట్టించుకోవడం లేదని జనం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు