ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గిరి యువతకు ఆశాకిరణం హోం నర్సింగ్‌ శిక్షణ

Home nursing Training ప్రస్తుత పరిస్థితుల్లో ఉద్యోగాలు రాక చాలామంది యువత ఆర్థికంగా ఎదురవుతున్న ఇబ్బందులతో ఆధైర్య పడుతున్నారు. గిరిజన యువత పరిస్థితి మరింత సంక్లిష్టం. కొలువులు కోసం ప్రయత్నాలు చేసిచేసి అలసి కూలీ బాట పడుతున్న వారు ఎందరో. అల్లూరి జిల్లా మన్యంలో పోలీసు వారి సహకారంతో ఉపాధి మార్గం వైపు ముందడుగు వేస్తున్న గిరిజన యువత కథ మాత్రం అందుకు కొంచెం భిన్నం.

tribal youth
tribal youth

By

Published : Aug 26, 2022, 6:35 AM IST

Home Nursing Training to Tribal Youth: ప్రస్తుత కాలంలో యువతకి ఎదురవుతున్న ప్రధాన సవాల్ కొలువుల సాధన. గిరిజన ప్రాంతాల్లో ఆ సమస్య మరింత ఎక్కువ. కుటుంబ ఆర్థిక పరిస్థితులు మొదలు అనేక సవాళ్లు దాటి చదువులు పూర్తి చేసిన వారికి... ఉపాధికల్పన మాత్రం సుదూరంగానే ఉంటోంది. సరైన నైపుణ్య శిక్షణ ఉంటే సమస్యను అధిగమించవచ్చంటున్నారు ఈ గిరి యువత.

మారుమూల ఏజెన్సీ ప్రాంతంలో పోలీసు వారి సహకారంతో జీఎంఆర్‌ హోం నర్సింగ్‌ అందిస్తున్న శిక్షణ వారికి కలసి వస్తోంది. పాడేరు మన్యం వంటి ప్రాంతంలో పోలీసులు ఇటువంటి సదుపాయం కల్పించడం వారికి ఆశాకిరణం అయింది. ఇటీవలే వారికి శిక్షణ పూర్తికావడంతోనే హైదరాబాద్‌లో కొలువులు సాధించడానికి మార్గం సుగమం అయింది.

కమ్యూనిటీ పోలీసింగ్‌లో భాగంగా యువతుల కోసం 3నెలల కిందట ప్రేరణ అనే ఉద్యోగ కల్పన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు పాడేరు పోలీసులు. అక్కడ వచ్చిన దరఖాస్తుల ద్వారా బాగా ఆర్థికంగా వెనుకబడిన ఉన్న కుటుంబాలకు చెందిన 35 మందిని ఎంపిక చేశారు. వీరికి జీఎంఆర్​ సంస్థకి సంబంధించిన హోమ్ నర్సింగ్ విభాగంలో నెలరోజులు శిక్షణ ఇచ్చారు. మంచి నైపుణ్యం కనబరిచిన 17 మందిని ఉపాధి కోసం హైదరాబాద్‌కి పంపించారు.

అనుకోకుండా వచ్చిన ఈ అవకాశంపై స్థానిక యువత ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సరైన విద్య, నైపుణ్యాలు లేని చోట... హోమ్‌ నర్సింగ్‌ శిక్షణ ధైర్యాన్ని ఇచ్చిందని చెబుతున్నారు. ఈ శిక్షణలో పొందిన ఉపాధితో తమ కళ్లపై తాము నిలబడతామని, కుటుంబాలకి ఉన్న ఆర్థిక ఇబ్బందుల నుంచి ఎంతోకొంత ఊరట లభిస్తుందని అంటున్నారు ఈ గిరి పుత్రికలు.

మన్యం జిల్లా పూర్తి అటవీప్రాంతం కావడంతో అక్కడి యువత మంచిమార్గంలో నడవాలని పోలీసుశాఖ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. చట్టవ్యతిరేక కార్యక్రమాలైన నక్సలిజం, గంజాయి వంటి వాటికి దూరంగా యువత ఎదిగేలా చేయడం ఈ ప్రయత్నాల ఉద్ధేశం. అందులో భాగంగానే గిరి యువతకు ఏదొక మార్గం చూపించాలని జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ భావించారు.

ఇందుకు దశలవారీగా యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేందుకు పోలీసులు బాటలు వేశారు. గతంలోనూ యువకులకి పలురంగాల్లో శిక్షణ ఇప్పించి ఉపాధి కల్పించింది ఇక్కడి పోలీస్ యంత్రాంగం. తొలిసారిగా యువతులను ఎంచుకుని ఆర్థికభరోసా కల్పిస్తున్నామని , వారికి ఉద్యోగంలో ఏమైనా సమస్యలు ఎదురైనా దగ్గర్లోని పోలీసులు అప్రమత్తం అవుతారని ఎస్పీ చెబుతున్నారు.

ఈ మంచి కార్యక్రమం తమ మనోధైర్యం, ఆత్మవిశ్వాసం పెంపొందేందుకు దోహాద పడుతుందని అంటున్నారు స్థానిక యువత. కొండల్లో, గిరిజన గుడాల్లో పెరిగిన తమకి నగరాల్లో ఉపాధి మార్గానికి బాటలు వేయిస్తున్న పోలీస్‌శాఖకు ధన్యవాదాలు చెబుతున్నారు.

గిరి యువతకు ఆశాకిరణం హోం నర్సింగ్‌ శిక్షణ

ABOUT THE AUTHOR

...view details