Alluri Sitaramaraju District: అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం, పెద్దకోట పంచాయతీలో హైడ్రో పవర్ ప్రాజెక్టు ఏర్పాటుకు అదానీ కంపెనీకి కేంద్ర ప్రభుత్వం పచ్చ జెండా ఊపడంపై గిరిజనులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గిరిజన చట్టాలకు వ్యతిరేకంగా ప్రభుత్వం చేపట్టిన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళన చేపట్టారు. ఈ హైడ్రో పవర్ ప్రాజెక్టు వల్ల సుమారు 17 గ్రామాలు నష్టపోతాయని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
17 గ్రామాల పరిధిలో సుమారు 9వేల మంది గిరిజనులు నిర్వాసితులుగా మారుతారని, ఎనిమిది వేల ఎకరాల పంట భూములకు తీవ్ర నష్టం ఏర్పడుతుందని వాపోతున్నారు. తమ ప్రాంతాన్ని రక్షించుకునేందుకు సీపీఎం, తెలుగుదేశం తదితర అఖిలపక్షాలతో కలిసి పోరాటానికి గిరిజనులు సిద్ధమవుతున్నారు. హైడ్రో పవర్ ప్రాజెక్టు పేరిట గిరిజన చట్టాలను తుంగలోకి తొక్కి కార్పొరేట్ సంస్థలకు తమ భూములను అప్పగించడాన్ని గిరిజనులు వ్యతిరేకిస్తున్నారు.