Child Died Due to Lack of Road Facilities: అల్లూరి సీతారామరాజు జిల్లాలో గిరిజనుల మరణ మృదంగం మార్మోగుతోంది. ఏళ్లు గడిచినా, పాలకులు మారినా ఆ ప్రాంతవాసుల దుస్థితి మాత్రం మారడం లేదు. కనీసం రహదారి సౌకర్యం కూడా లేని.. గిరిజన బతుకులకు ఇదే ఒక శాపంగా మారింది. గతవారం కొయ్యూరు మండలంలో ఆసుపత్రికి తరలిస్తుండగా ఓ గర్భిణి మృతి చెందిన ఘటన మరవక ముందే.. ఇదే తరహాలో మూడు నెలల వయసున్న ఓ పసికందు మృతి చెందాడు. కన్నబిడ్డ మృతి చెందిన కొండంత దుఃఖాన్ని దిగమింగుతున్న ఆ తల్లిదండ్రులకు.. రహదారుల సౌకర్యలేమితో బాలుడి మృతదేహాన్ని భుజంపై వేసుకుని ఇంటికి తీసుకుని వెళ్లే దుస్థితి ఎదురైంది.
వివరాల్లోకి వెళ్తే.. కొయ్యూరు మండలం మారుమూల మర్రిపాకలో ఓ వాలంటీర్ కుమారుడు సాయి(3 నెలలు) అనారోగ్యం బారిన పడ్డాడు. అయితే పసికందును ఆస్పత్రికి తరలించేందుకు ఆ ప్రాంతంలో రహదారి సౌకర్యం లేదు. దీంతో బాలుడిని ఎత్తుకుంటూ.. నానా అవస్థలు పడి కాలినడక మల్లికార్జుల గ్రామం వరకు తీసుకుని వెళ్లారు. అనంతరం అక్కడి నుంచి వాహనంలో చింతపల్లి ఆస్పత్రికి తరలించారు. అయితే అక్కడి చేరటం ఆలస్యం కావటంతో.. బాలుడి ఆరోగ్యం మరింత క్షీణించింది. దీంతో ఆ పసికందును నర్సీపట్నం హాస్పిటల్‌కు తరలించారు. అయితే అక్కడ వైద్యులు పరిస్థితి చేయిదాటి పోయిందని, మెరుగైన చికిత్స మేరకు కేజీహెచ్‌కు తరలించాలని తల్లిదండ్రులకు సూచించారు. ఈ క్రమంలో బాలుడిని కేజీహెచ్‌కు తరలిస్తుండగా.. మార్గమధ్యలోనే మృతిచెందాడు. బాలుడి మృతదేహాన్ని తీసుకుని ఇంటికి వెళ్లేందుకు వాహనం లేకపోవటంతో.. చూసి చలించిపోయిన ఓ బీజేపీ నాయకుడు ఐటీడీఏ పీఓకు సమాచారం ఇవ్వగా.. వారు 108 అంబులెన్స్‌ను ఏర్పాటు చేశారు.