ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నీళ్లలో కడిగితే రూ.500నోట్లు.. మన్యం పోలీసుల అదుపులో దొంగ నోట్ల ముఠా.. - Black coating notes

Circulation of fake notes : అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు పరిధిలో నకిలీ నోట్లు చలామణీ చేస్తున్న 9 మంది సభ్యుల ముఠా పోలీసులకు చిక్కింది. వారి నుంచి పెద్ద మొత్తంలో నకిలీ నోట్లతో పాటు బ్లాక్ కరెన్సీని కూడా పోలీసులు స్వాధీనం చేసుకుని.. నిందితులు, వారు ఉపయోగించిన సామగ్రిని మీడియా సమావేశంలో ప్రదర్శించారు.

పోలీసుల అదుపులో నకిలీ నోట్ల ముఠా
పోలీసుల అదుపులో నకిలీ నోట్ల ముఠా

By

Published : Mar 17, 2023, 12:19 PM IST

Circulation of fake notes : అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు పరిధిలోని మన్యం ప్రాంతంలో నకిలీ నోట్ల చలామణి కలకలం రేపింది. తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ కేంద్రంగా వీటిని తయారు చేసి గిరిజనులను మోసగిస్తున్న ముఠా గుట్టును పోలీసులు బహిర్గతం చేశారు. వీఆర్‌పురం మండలం రేఖపల్లిలో నకిలీ నోట్లు మార్పిడి చేస్తుండగా పోలీసులు నిఘా పెట్టి పట్టుకున్నారు. కేసు వివరాలను ఎస్పీ సతీశ్‌కుమార్‌ వెల్లడించారు.

మన్యం అడ్డాగా.. తెలంగాణకు చెందిన తొమ్మిది మంది ముఠాగా ఏర్పడి పాల్వంచలో పొదిల మురళి ఇంట్లో నకిలీ నోట్లు తయారు చేస్తున్నారు. వీటిని మన్యంలోని పలు ప్రాంతాల్లో చలామణీ చేస్తున్నారు. పాల్వంచలో ముద్రించి.. ఆంధ్రలోని వరరామచంద్రాపురం, చింతూరు, కూనవరం, ఛత్తీస్‌గఢ్‌లోని కుంట పరిసర ప్రాంతాల్లో మారుస్తున్నారు. ఎక్కువగా రద్దీగా ఉండే పెట్రోల్‌ బంకులు, కిరాణా దుకాణాలు, హోటళ్ల వద్ద చీకటి పడిన తర్వాత మార్పిడి చేస్తున్నారు. ఇప్పటివరకు ఆయా ప్రాంతాల్లో సుమారు 2.5 లక్షల విలువైన నోట్లు మార్చినట్లు పోలీసులు తెలిపారు. ఈ ముఠా నకిలీ నోట్లు మాత్రమే కాకుండా.. బ్లాక్‌ నోట్ల మార్పిడికి పాల్పడుతున్నట్లు గుర్తించారు. సినిమా షూటింగ్‌ల కోసం ప్రత్యేకంగా ముద్రించిన రూ.500 నోట్లను అమాయకులకు ఇచ్చి మోసగిస్తున్నట్లు తెలిపారు.

మీడియా ఎదుట వివరాలు వెల్లడించిన ఎస్పీ.. ఎస్పీ సతీష్ కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు దొంగనోట్ల ముఠాను మీడియా ముందు ప్రవేశ పెట్టారు. దొంగ నోట్లను చలామణి చేస్తూ వీ.ఆర్ పురం పోలీసుల చేతికి చిక్కారని తెలిపారు. వీరి నుంచి 44 లక్షల యాభై వేల రూపాయల దొంగనోట్లు, ప్రింటర్లు, లామినేషన్ మిషన్ ప్రింటింగ్ కోసం ఉపయోగించిన పేపర్ బండిల్స్, హైపో లిక్విడ్ స్వాధీన పరుచుకున్నారు. వాటితో పాటు, మోటార్ వాడే బ్లాక్ పేపర్, కరెన్సీ సైజులో కట్ చేసి.. వాటిని కెమికల్ తో కడిగితే 500 రూపాయల నోట్ వస్తుందని నమ్మబలికే బ్లాక్ పేపర్ బండిల్స్, ఒక ఆటోను పోలీసులు స్వాధీన పరుచుకున్నారు. దొంగనోట్ల ముఠాను చాకచక్యంగా అదుపులోకి తీసుకున్న చింతూరు సబ్ డివిజన్ పోలీసులను ఎస్పీ అభినందించారు.

దొంగనోట్ల ముఠా సభ్యులు నకిలీ నోట్లు మాత్రమే గాకుండా.. బ్లాక్ కోటింగ్ నోట్లు కూడా మార్పిడి చేస్తున్నారు. హవాలా మనీ పేరిట.. కోటింగ్ ఇచ్చామని చెప్పి మెటార్ రిపేరింగ్ లో ఉపయోగించే పేపర్ ను అందిస్తున్నారు. ఈ బ్లాక్ పేపర్ ను అయోడిన్ లిక్విడ్ లో ముంచడం వల్ల 500 రూపాయల నోటు బయటపడుతుందని నమ్మబలుకుతారు. ఒక కట్ట ఒరిజినల్ ముందు పెట్టి నాలుగు కట్టలను మార్పిడి చేస్తారు. ఇలాంటి దందా మన్యం ప్రాంతంలో ఈ మధ్యనే ఎక్కువగా కనిపిస్తోంది. - ఎస్.సతీష్ కుమార్, ఎస్పీ, అల్లూరు సీతారామరాజు జిల్లా

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details