Road Accident in Alluri district: అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం పోతవరంలో వారపు సంతకు వెళ్లి తిరిగి వస్తుండగా వ్యాన్ బోల్తా పడింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా.. మరో ఇరవై మందికి గాయాలయ్యాయి. మారుమల ప్రాంతం కావడం, తూర్పు ఏజెన్సీకి ఆనుకొని ఉండటం, సమాచార వ్యవస్థ లేకపోవడంతో ప్రమాదం జరిగిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మండల కేంద్రానికి సుదూరంలో ఉన్న మఠం భీమవరం పంచాయతీ పోతవరంలో ప్రతీ గురువారం వారపు సంత జరుగుతుంది. ఈ సంతకు మఠం భీమవరం చుట్టు పక్కల గ్రామాల నుంచి ప్రజలు ఎక్కువగా వస్తుంటారు. వ్యాన్లో సంతకు వెళ్లి తిరిగి వస్తుండగా దట్టమైన అటవీ ప్రాంతంలోని ఘాట్ రోడ్డులో వ్యాన్ అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో చీడికోట గ్రామానికి చెందిన కాకూరు ముత్యాలమ్మ(60), దబ్బకోట గ్రామానికి చెందిన గొల్లోరి లోయిసన్(55), సీహెచ్.వి లంకకు చెందిన ముత్యాలమ్మ మృతి చెందారు. చీడికోటకు చెందిన వంతల లక్ష్మణరావుకు కాలు విరిగిపోగా సుమారు ఇరవై మంది వరకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను సమీపంలోని గుర్తేడు పీహెచ్సీకి తరలించి ప్రథమ చికిత్స అందించారు.
బండరాయితో కొట్టి హత్య: అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం కదరంపల్లి గ్రామంలో గోవిందు అనే వ్యక్తిని గుర్తుతెలియని వ్యక్తులు బండరాయితో కొట్టి హత్య చేశారు. సదరంపల్లి శివార్లలో గోవిందు తన వ్యవసాయ పొలంలో గొర్రెల మంద వద్ద పడుకుని ఉంటే తెల్లవారుజామున తలపై బండరాయి వేసి దారుణంగా హత్య చేశారు. గ్రామస్థుల నుంచి సమాచారం అందుకున్న కళ్యాణదుర్గం డీఎస్పీ శ్రీనివాసులు తన సిబ్బందితో హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు.