Rains Problems: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు అల్లూరి సీతారామరాజు జిల్లాలో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. గత వారం రోజులుగా వర్షాల దాటికి ప్రధాన రహదారులు సహితం దెబ్బ తిన్నాయి. ముంచంగిపుట్టు మండలంలో గలా లబ్బురు సమీపంలో ప్రధాన రహదారి కోతకు గురి కావడంతో రాకపోకలు నిలిచిపోయాయి. మండలంలో వణుగుమ్మ, రంగబయలు, మాకవరం, దోడిపుట్ పంచాయతీలకు ఇదే ప్రధాన రహదారి. అలాగే సరిహద్దులో గలా ఓనకడిల్లి, మాచకుండ్ గ్రామాల ప్రజలు ఇదే రహదారిపై ఆధారపడి ఉన్నారు. అధికారులు స్పందించి వెంటనే మరమ్మతులు నిర్వహించాలని ప్రజలు కోరుతున్నారు.
సాధారణంగానే కొండ ప్రాంతాల్లోని గిరిజనులకు రహదారి కష్టాలు వర్ణణాతీతం. ఇప్పుడేమో భారీగా వర్షాలు, ఉప్పొంగుతున్న వరదలు. ఏది ఏమైనా.. కష్టం వస్తే చూస్తూ ఊరుకోలేరుగా. ఎలాగోలా ఆసుపత్రులకు తీసుకెళ్లాల్సిందే. కొయ్యూరు మండలం టి.ఎర్రగొండ గ్రామంలో.. గాయపడిన ఓ గిరిజనుడిని.. ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు.. ప్రమాదకర రీతిలో వాగు దాటించారు ఆ గ్రామస్తులు. రహదారి సౌకర్యం లేకపోవడంతో.. డోలీ కట్టి సుమారు పది కిలోమీటర్లు మోసుకెళ్లి ఆసుపత్రిలో చేర్పించారు. ఏళ్లు గడుస్తున్నా, ప్రభుత్వాలు మారుతున్నా.. తమ బతుకులు మాత్రం మారట్లేదని గిరిపుత్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రహదారి సౌకర్యం కల్పించాలని వేడుకుంటున్నా అధికారులు కనికరించట్లేదని వాపోతున్నారు.