PPA on polavaram: పోలవరం ప్రాజెక్టులో ప్రస్తుత అస్తవ్యస్త పరిస్థితులకు ఇప్పుడు అధికారంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాన్ని దోషిగా ప్రాజెక్టు అథారిటీ తేల్చింది. దిగువ కాఫర్‌డ్యాంను 2022 జులైలోగా నిర్మించాల్సి ఉన్నా.. ఈ ప్రభుత్వం పట్టించుకోలేదని తప్పుపట్టింది. అందుకే ప్రధాన డ్యాం నిర్మించాల్సిన ప్రదేశాన్ని వరద ముంచెత్తిందని వెల్లడించింది. ఇకముందు తలెత్తబోయే ఇతర విపరిణామాలకు దిగువ కాఫర్‌డ్యాం సకాలంలో నిర్మించకపోవడమే ప్రధాన కారణమవుతుందని అప్రమత్తం చేసింది. ప్రాజెక్టు అథారిటీ సూచనలను ప్రభుత్వం మూడేళ్లనుంచి విస్మరిస్తోందంటూ నిలదీసింది.
అథారిటీ అభ్యంతరాలివీ..
పోలవరం నిర్మాణం విషయంలో తమ సూచనలను రాష్ట్ర ప్రభుత్వం మూడేళ్ల నుంచి విస్మరిస్తూ వస్తోందని ప్రాజెక్టు అథారిటీ నిలదీసింది. 2019 నవంబర్‌లో కొత్త కాంట్రాక్టు సంస్థకు పోలవరం పని అప్పగించే నాటికి... దిగువ కాఫర్‌డ్యాంలో 22.09 లక్షల క్యూబిక్ మీటర్ల పని మాత్రమే మిగిలి ఉంది. 2022 ఏప్రిల్‌లో ప్రాజెక్టుకు కొత్త షెడ్యూలు సిద్ధం చేశారు. ఆ ప్రకారం 2022 జులై నాటికి దిగువ కాఫర్‌డ్యాం పూర్తి చేయాల్సి ఉంది. జులైలోపు పని పూర్తి చేసేస్తామని పదేపదే జలవనరులశాఖ చెబుతూ వచ్చినా సాధ్యం కాలేదు. దీనిపై ఏప్రిల్ నుంచి జులైలోపు అనేక సార్లు రాష్ట్ర జలవనరుల శాఖను హెచ్చరిస్తూనే ఉన్నట్లు పీపీఏ స్పష్టం చేసింది. ప్రధాన డ్యామ్ పనులకు దిగువ కాఫర్‌డ్యాం నిర్మాణం అడ్డంకిగా మారుతుందని, వరద ముంచెత్తుతుందని.... త్వరగా పూర్తి చేసుకోవాలని కేంద్ర జలసంఘం డైరెక్టర్ వివరంగా చెప్పినా ప్రయోజనం లేకుండా పోయిందని పీపీఏ తెలిపింది. రాష్ట్ర జలవనరుల శాఖ తీరు చూస్తే... ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేసేలా లేదని తీవ్రంగా ఆక్షేపించింది. ప్రాజెక్టు పర్యవేక్షణకు మేనేజ్‌మెంట్ టూల్‌ను సేకరించి ప్రాజెక్టు, అథారిటీ, ఏపీ జలవనరుల శాఖలో ఏర్పాటుచేయాలని మూడేళ్లకుపైగా చెబుతూనే ఉన్నా.... తమ సూచనలను రాష్ట్ర జలవనరులశాఖ పట్టించుకోవడం లేదని నిరసన వ్యక్తం చేసింది.