Power Outage in Seeleru Hydropower Station: అల్లూరి జిల్లాలో జలవిద్యుత్ కేంద్రంలోని ఇంజినీర్‌లు, సిబ్బంది కోతుల వల్ల 9 గంటలు శ్రమించాల్సి వచ్చింది. అల్లూరి జిల్లా సీలేరు జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. ఉత్పత్తి అనంతరం స్విచ్‌యార్డ్ ద్వారా విద్యుత్ సరఫరా ఇతర ఫీడర్లకు సరఫరా అవుతూ ఉంటుంది. అయితే శుక్రవారం ఉదయం 6 గంటల సమయంలో ఒక్కసారిగా ఊరంతా కరెంటు సరఫరా నిలిచిపోయింది.
ఏమైందో అర్థంకాక ఇంజినీర్లు, కార్మిక సిబ్బంది విద్యుత్ కేంద్రానికి పరుగులు తీశారు. అక్కడ వారు చూసిన ఘటనకు బాధ పడాలో, కోతుల వల్ల విద్యుత్ నిలిచిపోయినందుకు కోపం రావాలో ఆర్థం కాలేదు. అందుకు కారణం స్విచ్‌యార్డ్ విద్యుత్తీగలపై రెండు కోతులు పడి.. హై వోల్టేజీ రావడంతో ఒక్కసారిగా మూడు ఇన్సులేటర్లు. ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయాయి. గుర్తించిన అధికారులు హుటహుటిన విద్యుత్ పునరుద్ధరణ చర్యలు చేపట్టారు.