Police seized Ganja: కార్లలో తరలిస్తున్న కోటి రూపాయలు విలువ చేసే 840 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు ఎస్‌ఈబీ సీఐ సంతోష్ తెలిపారు. ఘటనకు సంబంధించి నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. ఆయన తెలిపిన ప్రకారం.. సోమవారం ఉదయం ముంచంగిపుట్టు మండలం సుత్తిగుడ సమీపంలో పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో వస్తున్న రెండు కార్ల నుంచి భారీ మొత్తంలో గంజాయిను పట్టుకున్నట్టు చెప్పారు.
సరకును తరలిస్తున్న ముంచంగిపుట్టు మండలానికి చెందిన పలాస విజయ్, గిలియ మాంగో అనే ఇద్దరు వ్యక్తులతో పాటు, మహారాష్ట్రకు చెందిన వికాస్ ధారాసింగ్ జాదవ్, రాజేష్ నాందేవ్ మహతిలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుంచి కార్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ తనిఖీలలో ఎస్‌ఈబీ ఎస్సై ఫణీంద్రబాబు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. కాగా వారం రోజుల వ్యవధిలో సుమారు 1000 కిలోల గంజాయిని పట్టుకున్నారు.
కుమార్తె కోసం భార్యను అతి కిరాతకంగా: కుటుంబ కలహాలతో భార్యను అతి కిరాతకంగా భర్త హత్య చేశాడు. ఈ ఘటనపై కృష్ణా జిల్లా మచిలీపట్నం తాలుకా పోలీసులు కేసు నమోదు చేశారు. ఉయ్యూరు ప్రాంతానికి చెందిన కోటేశ్వరరావుకి గతంలో వివాహం అయి.. భార్య నుంచి విడిపోయి ఒంటరిగా ఉంటున్నాడు. కోటేశ్వరరావుకి.. బందరు ప్రాంతానికి చెందిన వెంకటేశ్వరమ్మతో ఏడేళ్ల క్రితం పరిచయం అయింది. ఈవిడ కూడా భర్త నుంచి విడిపోయింది. వీళ్లిద్దరి పరిచయం.. తరువాత పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరికీ అప్పటికే పిల్లలు ఉండగా.. వారిని బంధువుల వద్ద వదిలేసి.. గత ఏడు సంవత్సరాలుగా కలిసి ఉంటున్నారు. వీరికి ఒక కుమారుడు ఉన్నాడు.