MLC Elections Arrangements : అల్లూరి సీతారామరాజు జిల్లాలో 11 మండలాల్లో జరగబోయే ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. 11 మండలాల్లో 15 పోలీస్ స్టేషన్లలో 11,525 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. సుమారు 500 మంది పోలింగ్ స్టాఫ్‌ను వారి పోలింగ్ కేంద్రాలకు 7 ప్రత్యేక రూట్ బస్సుల ద్వారా తరలించారు. జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్.. పోలింగ్ సిబ్బంది బూత్‌లకు వెళ్లేందుకు అన్ని ఏర్పాట్లు చేసి పంపించారు. జాయింట్ కలెక్టర్ శివ శ్రీనివాస్ స్వయంగా మైక్‌లో జాగ్రత్తలు చెబుతూ అందర్నీ బస్సుల్లో ఎక్కించారు. ముఖ్యంగా పోలింగ్ స్టాఫ్ ఫోన్లు వాడరాదని హెచ్చరించారు. ఫోన్లు స్విచ్ ఆఫ్‌లో ఉంచాలని చెప్పారు. దూరమైన, సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల బస్సు రూట్లను ముందుగా తరలించారు.
విధుల్లో బోధనేతర సిబ్బంది...ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తొలిసారిగా బోధనేతర సిబ్బందితో ఓటింగ్ ప్రక్రియ నిర్వహిస్తున్నారు. బ్యాంకులు, రెవెన్యూ ఇరిగేషన్ ఆర్ డబ్య్లూఎస్, ఎంపీడీవోలు, ఇతర ఉపాధ్యాయులు కాని సిబ్బంది సుమారు 500 మంది ఎన్నికల ప్రక్రియలో పాల్గొంటున్నారు. ఎన్నికల సామగ్రి పంపిణీ, రూట్ మ్యాపింగ్ వాహనాల తరలింపు తదితర ప్రక్రియను జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ దగ్గరుండి స్వయంగా పరిశీలించారు. జాయింట్ కలెక్టర్ శివ శ్రీనివాస్ రూట్ మ్యాప్ విషయాల్లో తగు సూచనలు ఇచ్చారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో పటిష్ట బందోబస్తు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు.
ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేశాం. జిల్లాలోని 11 మండలాల పరిధిలో 11,525 మంది ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇప్పటికే పోలింగ్ సిబ్బందికి సామగ్రి పంపిణీ కూడా పూర్తి చేశాం. ఉపాధ్యాయులు మినహా.. ఇతర ప్రభుత్వ శాఖలకు చెందని నిపుణులైన సిబ్బందిని ఎంపిక చేశాం. పోలీస్ బందోబస్తు కొనసాగుతుంది. పకడ్బందీగా పోలింగ్ పూర్తి చేసేలా అవసరమైన అన్ని చర్యలు చేపట్టాం. - సుమిత్ కుమార్, కలెక్టర్, అల్లూరి సీతారామరాజు