ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Godavari Flood Victims: కట్టుబట్టలతో వస్తే వండుకుని తినమంటున్నారు.. గోదావరి వరద బాధితుల వెతలు - వరద బాధితులకు వంట సామాగ్రి

No Facilities to Godavari Flood Victims: గోదావరి వరదల్లో ఇళ్లు మునిగి, ఇంట్లో వస్తువులు, సరుకులు తడిసిపోయి.. దీన స్థితిలోనున్న వరద బాధితులకు ప్రభుత్వ ఆదరణ కరవైంది. ములిగే నక్కపై తాటిపండు పడినట్లుగా.. పునరావస కేంద్రాలకు చేరిన వరద బాధితులను వండుకుని తినమని ప్రభుత్వం సరుకులందిస్తోంది. ఆ అందించే సరుకులు కూడా ఇప్పటి వరకు కేవలం 30శాతం మందికే అందించారు.

Etv Bharat
Etv Bharat

By

Published : Jul 31, 2023, 7:08 AM IST

Updated : Jul 31, 2023, 9:19 AM IST

వరద బాధితులకు అన్నం కూడా పెట్టలేకపోతున్న ప్రభుత్వం

No Facilities to Godavari Flood Victims in Alluri Distrcit: గోదావరి వరదలో నిండా మునిగి.. పునరావాస కేంద్రాలకు చేరిన బాధితులకు ప్రభుత్వం అన్నం కూడా పెట్టలేకపోతోంది. సరకులిస్తాం వండుకోండంటూ చేతులెత్తేసింది. పిల్లలను తీసుకొని కట్టుబట్టలతో తరలివచ్చినవారు.. ఎలా వంట చేసుకుంటారనే ఆలోచన ప్రభుత్వానికి లేకుండాపోయింది. చోటు కానీ చోటుకు వచ్చి.. వంటసామగ్రి లేకుండా వంట ఎలా చేసుకుంటామని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అల్లూరి జిల్లాలోని పోలవరం విలీన మండలాల్లో వరద ముంచెత్తుతున్నా.. క్యాంపు కార్యాలయానికే పరిమితమైన సీఎం జగన్‌పై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

పోలవరం విలీన మండలాల్లో వరదలు మొదలై వారం రోజులవుతున్నా.. ఇప్పటికి కేవలం 30శాతం మందికి మాత్రమే నిత్యావసరాలు అందించగలిగామని అధికారులే చెబుతున్నారు. దీన్నిబట్టి ప్రభుత్వం ఏమేరకు ఆదుకుంటుందో పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. వారం క్రితం నుంచి గ్రామాల్లోకి వరద చేరడం మొదలైనా.. మూడు రోజుల నుంచే సరుకులిస్తున్నారు. అదీ కొన్నిచోట్ల కందిపప్పు, బియ్యం మాత్రమే ఇచ్చి సరిపెట్టారు. మరికొన్ని చోట్ల పది ఉల్లి పాయలు, ఏడు దుంపలు, కిలో కందిపప్పు, కాసిన్ని దొండకాయలు తెచ్చి వాటాలేసి తీసుకోమంటున్నారు.

ఇదేనా ప్రభుత్వం చూపే ఉదారత అని నిర్వాసితులు ప్రశ్నిస్తున్నారు. ఈనాడు-ఈటీవీ భారత్​ బృందం అల్లూరి జిల్లాలోని పలు పునరావాస కేంద్రాలను పరిశీలించగా.. బాధిత కుటుంబాలు పడుతున్న అవస్థలు వర్ణణాతీతం. కనీసం గుడారాలు వేసుకునేందుకు పరదాలు ఇచ్చే పరిస్థితి కూడా లేదని బాధితులు కన్నీటి పర్యంతమవుతున్నారు. ఇళ్లు మునగడంతో వేల కుటుంబాలు కొండలపైకి ఎక్కి చిమ్మచీకట్లో తలదాచుకుంటున్న పరిస్థితులు ఉన్నాయి.

"ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి సదుపాయం అందలేదు. చంద్రబాబు ఉన్నప్పుడు పులిహోర ప్యాకెట్లు, మందులు, పరదాలు ఇచ్చేవారు. ఇప్పుడైతే అవేమి లేవు. అధికారులు ఎక్కడు ఉంటున్నారో.. ఏం చేస్తున్నారో తెలియటం లేదు. ఇప్పటి వరకు ఒక్క అధికారి కూడా ఇటువైపు రాలేదు."-నిర్వాసితురాలు

వరదల సమయంలో బాధిత కుటుంబాలను సహాయ పునరావాస కేంద్రాలకు తరలించి, వారికి ఆహారంతో సహా అన్ని సౌకర్యాలను కల్పించడం ప్రభుత్వ బాధ్యత. ప్రస్తుతం గోదావరికి వరద ఒక్కరోజులో వచ్చిందేమీ కాదు. తెలంగాణలో వర్షం కురిస్తే వరద వస్తుందని ముందే తెలుసు. వరద రాక ముందే సహాయ, పునరావాస కేంద్రాలకు నిత్యావసరాలను తరలించాల్సిన బాధ్యత అధికారులపై ఉంటుంది. అయితే అలాంటి ముందస్తు ఏర్పాట్లే లేవు.

అల్లూరి జిల్లాలో మొత్తం 113 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. సుమారు 20వేల కుటుంబాలను తరలించారు. ఎటపాక, వీఆర్ పురం, కూనవరం, చింతూరు మండలాల్లో వందల గ్రామాలు ముంపు బారినపడ్డాయి. అయితే ముంపుకు గురైన వారిలో 70శాతం కుటుంబాలకు నిత్యావసరాలు అందలేదని అధికారులే చెబుతున్నారు. ముంపు ప్రాంతాలకు మంత్రులు, రాష్ట్రస్థాయి ఉన్నతాధికారులు వచ్చిన దాఖలాలూ లేవు.

పునరావాస కేంద్రాల్లో అధికారులు సరకులు మాత్రమే ఇచ్చి సరిపెడుతున్నారు. అక్కడ వంట చేసుకోవాలన్నా.. వంటపాత్రలు, సరుకులవంటివేమి లేవు. కొందరు నానా హైరానా పడుతూ ఇళ్లకు వెళ్లి వంట సామగ్రి తెచ్చుకుంటున్నారు. నీట మునిగిన ప్రాంతాల్లో అయితే ఇళ్లకూ వెళ్లే పరిస్థితి లేక అర్థాకలితో అలమటిస్తున్నారు. చింతూరులోని ఐటీడీఏ కార్యాలయం పక్కనున్న ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కళాశాలల్లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాల్లో 120 వరకు కుటుంబాలు నాలుగు రోజులుగా ఆశ్రయం పొందుతున్నాయి. వీరికి మూడు రోజుల క్రితం కందిపప్పు ప్యాకెట్ ఒకటి మాత్రమే ఇచ్చారు. దానితో వంట ఎలా చేసుకుని తింటారన్నది అధికారులు పట్టించుకోలేదు. 'ఈ-టీవీ'లో కథనం రావడంతో.. నిన్న సాయంత్రానికి అధికారులు హడావుడిగా చేరుకుని నిత్యావసరాలను పంపిణీ చేశారు. ఉల్లిపాయలు, దుంపలు ఇస్తే ముంపు సమస్య తీరిపోతుందా అని నిర్వాసితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం గుడారాలు వేసుకునేందుకు పరదాలు కూడా ఇవ్వలేదని కన్నీటి పర్యంతమవుతున్నారు.

కూనవరం, వీఆర్​పురం బాధితులకు నూనె, ఉల్లిపాయలు, కూరగాయలు పంపిణీ చేస్తున్నా.. చింతూరులో బాధితులను మాత్రం పట్టించుకోలేదు. పునరావాస కేంద్రంలో కనీసం మరుగుదొడ్లు లేవు.. మంచినీరు కూడా అందుబాటులో లేదు. దీంతో బాధిత కుటుంబాలు ఉదయం వేళ ఇళ్లకు వెళ్లి కాలకృత్యాలు తీర్చుకుంటున్నారు. చాలామంది ముంపునకు గురైన గృహాల్లోనే వండుకుని క్యారేజీలు కట్టుకుని వచ్చి పునరావాస కేంద్రంలో తింటున్నారు.

"ఇళ్లలోకి వెళ్లాలంటే భయమేస్తోంది. పాములు, విషపురుగులు ఉంటాయని భయంగా ఉంది. ఎటువెళ్లాలో తెలియని ఆయోమయంలో ఉన్నాం. మేము ప్రభుత్వాన్ని గతంలోనే పునరావసం కల్పించాలని కోరాము. కట్టుబట్టలతో పిల్లల్ని తీసుకుని వచ్చాము." -నిర్వాసితుడు

చింతూరు మండలం కుయిగూరు గ్రామంలో 300 కుటుంబాల వరకు ఉన్నాయి. మొత్తం ఇళ్లు నీట మునుగుతాయని అధికారులకు తెలుసు. అయినా వారికి పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేయలేదు. చింతూరు రమ్మంటున్నారని.. 4 కిలో మీటర్ల దూరం పిల్లలను తీసుకుని ఎలా వెళ్లాలనే ప్రశ్న బాధితుల్లో వ్యక్తమవుతోంది. దీంతో వాళ్లంతా సమీపంలోని కొండలపైకి వెళ్లి గుడెసెలు వేసుకుని చీకట్లో గడిపేస్తున్నారు. చిన్నపిల్లలతో రాత్రిళ్లు జాగారం చేయాల్సివస్తోంది. మంచినీళ్లు బోట్లపై వెళ్లి తెచ్చుకుంటున్నారు.

Last Updated : Jul 31, 2023, 9:19 AM IST

ABOUT THE AUTHOR

...view details