Michaung Cyclone Affect in North Andhra and Rayalaseema: మిగ్‌జాం తుపాను ఉత్తరాంధ్ర జిల్లాల్లోనూ తీవ్ర ప్రభావం చూపింది. రోడ్లు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల్లో వేల ఎకరాల్లో వరి, మిర్చి, కంది పంటలు నీట మునిగాయి. చెరువులను తలపిస్తున్న పొలాలను చూసి రైతులు లబోదిబోమంటున్నారు. కోత కోసిన వరి కుప్పలు, మిర్చి పూర్తిగా తడిసిపోయాయి. కల్లాల్లో ధాన్యం, మిర్చి తడిసి రంగుమారే అవకాశం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎడతెరిపిలేని వర్షానికి విశాఖ జిల్లా ములగడలో రెండు ఇళ్ల గోడలు కూలిపోయాయి.
"ఉపాధి ఏమి లేకా వ్యవసాయమే జీవనోపాధిగా చేసుకుని వరి సాగుచేస్తున్నాను. అకాల వర్షాలతో తీవ్రంగా నష్టం వాటిల్లింది. సుమారు రూ.5 లక్షల పెట్టుబడితో 20 ఎకరాలు కౌలుకి తీసుకొని వ్యవసాయం చేస్తున్నాను. మిగ్జాంగ్ తుపాను వల్ల చేతికి అందివచ్చిన పంట నీట మునిగిపోయింది. ఈ వర్షాల వల్ల పెట్టిన పెట్టుబడి కూడా రాదు. మమ్మల్ని అధికారులే ఆదుకోవాలి." - ప్రసాద్,విజయనగరం జిల్లా
పంట నీటి పాలైందని మహిళా రైతు కన్నీరు - మనసు చలించే దృశ్యం
Michaung Cyclone Affected in Anakapalli: కుండపోత వర్షానికి అనకాపల్లి జిల్లా చోడవరంలో స్థానిక కోర్టు ప్రాంగణం జలమయమైంది. ఎస్సీ బాలికల వసతి గృహంలో నీరు కారుతుండటంతో బాలికలను ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్‌కు తరలించారు. స్థానిక సర్పంచి ఇల్లు ముంపునకు గురైంది. నర్సీపట్నం నుంచి తుని వెళ్లే ప్రధాన రహదారిలో వరద ఉద్ధృతితో వాహనాలు నిలిచి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. నక్కపల్లిలోని చేనేత కాలనీ, సమీపంలోని జగనన్న కాలనీ, ఎలమంచిలిలోని లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లు పూర్తిగా నీట మునిగాయి. వరి పంట చేతికందే దశలో తుపాను దెబ్బతీసిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరి కుప్పలు, ధాన్యాన్ని కాపాడుకునేందుకు అన్నదాతలు నానా అవస్థలు పడుతున్నారు.
"ఈనెల 3న పంట కోసి చేనులో మేరక ప్రాంతంలో ధాన్యం రాసి చేశాను. ఆ తర్వాత నుంచి వర్షాలు కురవడంతో బయటకు తీసుకొచ్చి ఆరబెట్టేందుకు వీలు లేకుండా పోయింది. మంగళవారం రాత్రి నుంచి బుధవారం ఉదయం వరకు కుండపోతగా కురిసిన వర్షానికి మొత్తం ధాన్యం రాసి ముంపు బారిన పడింది. బుధవారం కూలీలను ఏర్పాటు చేసుకుని ముంపులో ఉన్న ధాన్యాన్ని నీటిలోంచి దొరికిన ధాన్యాన్ని ఒడ్డుకు తీసుకొచ్చాను." -కోనసీమ జిల్లా రైతు