Irregularities in MGNREGA Works: జాతీయ ఉపాధి హామీ పథకంలో భాగంగా.. పనులు పూర్తైన ప్రదేశంలో బోర్డులు ఏర్పాటు చేస్తారు. అల్లూరి జిల్లాలో మాత్రం బోర్డులు ఏర్పాటు చేయకుండానే పనులను ముగించేశారు. ఇదివరకు పూర్తైన పనులకు.. పాత జిల్లాల పేర్లతో నూతన బోర్డులు ఏర్పాటు చేశారు. విశాఖ ఉమ్మడి జిల్లాగా ఉన్న సమయంలో హుకుంపేట మండల పరిధిలో చేపట్టిన పనుల ప్రదేశంలో వారం కిందట నూతన బోర్డులు ఏర్పాటు చేశారు. వాటిలో పనులకు సంబంధించిన నిధుల వివరాలు పొందుపరచలేదు. కొన్ని బోర్డులైతే నాసిరకం కారణంగా అప్పుడే పడిపోయాయని ఆ ప్రాంత ప్రజలు చెబుతున్నారు.
ప్రస్తుతం ఏర్పాటు చేసిన బోర్డులు 2020-2021 లో చేపట్టిన పనులవిగా గ్రామస్థులు భావిస్తున్నారు. పాడేరు, పెదబయలు మండలాల్లో పనులు జరిగిన ప్రాంతాల్లో బోర్డులు ఏర్పాటు చేయకుండా వాటిని గ్రామ పంచాయతీల్లో, ఇళ్లల్లో పడేశారు. కొన్ని పంచాయతీ కేంద్రాల వద్ద ఈ బోర్డులను ఏకంగా సిమెంట్ పోతలతో తయారు చేస్తున్నట్లు కనిపిస్తోంది.
గ్రామాల్లో సోషల్ ఆడిట్ జరుగుతున్న నేపథ్యంలో.. వారికి అవసరమైన ప్రాంతాల్లో అప్పటికప్పుడు వాటిని ఏర్పాటు చేసి బిల్లులు పొందవచ్చనే ఆలోచన చేసినట్లుగా స్థానిక ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఒక ప్రాంతంలో సోషల్ ఆడిట్ జరగని పరిస్థితుల్లో మిగిలిన ఖాళీ ఫలకాల్ని మరొక ప్రాంతానికి తరలించేందుకు వినియోగిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.