ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Bail: అరకు మాజీ ఎంపీ కొత్తపల్లి గీతకు బెయిల్​

Bail to Ex MP Kothapalli Geetha: బ్యాంకును మోసం చేశారన్న కేసులో అరెస్టై.. జైలులో ఉన్న అరకు మాజీ ఎంపీ కొత్తపల్లి గీతకు తెలంగాణ హైకోర్టు బెయిల్​ ముంజూరు చేసింది. సీబీఐ కోర్టు ఆమెకు ఐదేళ్లు జైలుశిక్ష విధించగా.. హైకోర్టును ఆశ్రయించారు. ఈరోజు విచారించిన కోర్టు.. సీబీఐ కోర్టు తీర్పు అమలును నిలిపివేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులిచ్చింది.

ex mp kothapalli geetha
ex mp kothapalli geetha

By

Published : Sep 16, 2022, 6:46 PM IST

Bail to Ex MP Kothapalli Geetha: అరకు మాజీ ఎంపీ కొత్తపల్లి గీత, ఆమె భర్త పి.రామకోటేశ్వరరావుకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. రూ.25 వేల పూచీకత్తు సమర్పించాలని ఆదేశించిన న్యాయస్థానం.. సీబీఐ కోర్టు తీర్పు అమలు నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కొత్తపల్లి గీత కేసు తదుపరి విచారణ డిసెంబరు 16కు వాయిదా వేసింది. బ్యాంకును మోసం చేశారన్న కేసులో కొత్తపల్లి గీతకు ఇప్పటికే సీబీఐ కోర్టు ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. సీబీఐ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ.. కొత్తపల్లి గీత దంపతులు హైకోర్టును ఆశ్రయించారు. విచారణ చేపట్టిన న్యాయస్థానం బెయిల్​ మంజూరు చేసింది.

అసలేం జరిగిందంటే..బ్యాంకును మోసం చేశారన్న కేసులో అరకు మాజీ ఎంపీ కొత్తపల్లి గీతకు హైదరాబాద్ సీబీఐ కోర్టు ఇటీవల ఐదేళ్ల జైలు శిక్ష, రూ.లక్ష జరిమానా విధించింది. రుణాల పేరిట పంజాబ్ నేషనల్ బ్యాంకును రూ.42 కోట్లు మోసం చేశారన్న కేసులో కొత్తపల్లి గీత, ఆమె భర్త రామకోటేశ్వరరావు, తదితరులను సీబీఐ కోర్టు దోషిగా తేల్చింది. కొత్తపల్లి గీత, ఆమె భర్త పి.రామకోటేశ్వరరావు డైరెక్టర్లుగా ఉన్న విశ్వేశ్వర ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ గతంలో పంజాబ్ నేషనల్ బ్యాంకు నుంచి రుణాలు పొందింది. అయితే బ్యాంకు అధికారులతో కుమ్మక్కై తప్పుడు డాక్యుమెంట్లతో రుణాలు పొంది వాటిని ఇతర అవసరాలకు దారి మళ్లించి మోసం చేశారని అభియోగం.

పంజాబ్ నేషనల్ బ్యాంకు ఫిర్యాదు మేరకు కొత్తపల్లి గీత, పి.రామకోటేశ్వరరావు, విశ్వేశ్వర ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌తో పాటు బీకే జయప్రకాశన్‌, కేకే అరవిందాక్షన్‌, డాక్యుమెంట్లు తయారు చేసిన ఎస్.రాజ్‌కుమార్‌పై బెంగళూరులోని సీబీఐ బ్యాంకింగ్ నేరాల విభాగం కేసు నమోదు చేసింది. దర్యాప్తు చేసి నిందితులపై 2015లో హైదరాబాద్ సీబీఐ కోర్టులో సీబీఐ ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది. విచారణ జరిపిన సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం.. వివిధ సెక్షన్ల ప్రకారం నిందితులందరూ నేరానికి పాల్పడినట్లు తేలుస్తూ నిన్న తీర్పు వెల్లడించింది. కొత్తపల్లి గీత దంపతులకు ఐదేళ్ల జైలుశిక్ష, రూ.లక్ష జరిమానా విధించిన కోర్టు.. వారితో పాటు బ్యాంకు అధికారులు జయప్రకాశన్‌, అరవిందాక్షన్‌కూ ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. విశ్వేశ్వర ఇన్‌ఫ్రాకు రూ.2 లక్షల జరిమానా విధించింది.

కోర్టు జైలు శిక్ష విధించడంతో వెంటనే సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. కొత్తపల్లి గీత అస్వస్థతకు గురి కావడంతో నిన్న ఉస్మానియా ఆస్పత్రిలో చేర్చించారు. ఇవాళ వైద్యులు డిశ్చార్జ్ చేయడంతో కొత్తపల్లి గీతను సీబీఐ అధికారులు చంచల్‌గూడ మహిళా జైలుకు తరలించారు. మిగతా నలుగురు (పి.రామకోటేశ్వరరావు, బీకే జయప్రకాశన్‌, కేకే అరవిందాక్షన్‌, ఎస్.రాజ్‌కుమార్‌) చంచల్‌గూడ జైలులో ఉన్నారు.

2014లో వైకాపా తరఫున అరకు ఎంపీగా గెలుపొందిన కొత్తపల్లి గీత.. తర్వాత ఆ పార్టీని వీడారు. 2018లో జనజాగృతి పేరిట రాజకీయ పార్టీని నెలకొల్పారు. అనంతరం ఆమె భాజపాలో చేరి.. తన పార్టీనీ అందులో విలీనం చేశారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details